Reserve Bank: బ్యాంకులకు, రుణ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలు ప్రజలకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముందుగా.. ఆర్‌బీఐ లేటెస్ట్‌గా ఎలాంటి గైడ్‌లైన్స్‌ని విడుదల చేసిందో చూద్దాం. లోన్ తీసుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే రుణ సంస్థలు అతను/ఆమె లోన్ తీసుకునేటప్పుడు రిఫరెన్స్‌గా ఇచ్చిన నంబర్‌లకు ఫోన్ చేస్తున్నారు. తర్వాత.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.
కేసులు బుక్ చేస్తామంటూ భయపెట్టడం, బెదిరించటం వంటివి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చాలా మంది మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం రుణ సంస్థలు.. పైన పేర్కొన్నవేవీ చేయకూడదు. లోన్ తీసుకున్న వ్యక్తి గురించి లేనిపోని ప్రచారం చేయొద్దు. లోన్ తీసుకున్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మాటల రూపంలో గానీ చేతల రూపంలో గానీ వేధించకూడదు. రుణ గ్రహీతల ప్రైవసీకి భంగం కలిగించే ఏ చర్యా తలపెట్టకూడదు.
Cyber Congress: ముగిసిన సైబర్ కాంగ్రెస్. తెలంగాణవ్యాప్తంగా పెరగనున్న సైబర్ అంబాసిడర్లు.
ఇచ్చిన డబ్బుల్ని రాబట్టుకునే బాధ్యతను ఆర్థిక సంస్థలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు, థర్డ్ పార్టీలకు అప్పజెప్పినప్పటికీ ఆయా ఏజెంట్ల విపరీత ప్రవర్తనకు, అభ్యంతరక చర్యలకు కూడా ఆయా ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాలని ఆర్‌బీఐ తేల్చిచెప్పటం గమనించాల్సిన విషయం. కమర్షియల్ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌజింగ్ లోన్ సంస్థలు, సహకార బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు ఈ రూల్స్ పాటించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నిబంధనలు మైక్రో లోన్లకు వర్తించవనే మినహాయింపు తప్ప మిగతా అన్ని అంశాలూ ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయి.
ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సహజంగా దాన్ని ఎగ్గొట్టాలని చూడడు. గడువు లోపే పేమెంట్ చేయటానికి ప్రయత్నిస్తాడు. తద్వారా తన క్రెడిట్/సిబిల్ స్కోర్ పెరుగుతుందని, భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ లోన్ తీసుకోవచ్చని ఆశిస్తాడు. కానీ అనుకోని పరిస్థితులు ఎదురైతే, ఆదాయం కోల్పోతే ఈఎంఐలు చెల్లించలేడు. చేతిలో, ఖాతాలో డబ్బు లేకపోవటం వల్లే ‘వాయిదాలు’ వేస్తుంటాడు. దీన్ని ఆర్థిక సంస్థలు అర్థంచేసుకోకుండా అతడి/ఆమె పైన ఉద్దేశపూర్వక రుణఎగవేతదారుగా ముద్ర వేస్తున్నారు. కొంత మందికి ఆస్తులున్నా అమ్ముకునే వీల్లేక రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్నారు.
ఈ విషయాన్ని సైతం ఆర్థిక సంస్థలు పరిగణనలోకి తీసుకోకపోవటం బాధాకరం. లోన్ తీసుకునేటప్పుడు పలు పత్రాల మీద సంతకాలు చేయాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆ పేపర్లలో సవాలక్ష కండిషన్లు ఉంటాయి. వాటిని సహజంగా ఎవరూ చదవరు. లోన్ ఇచ్చేవాళ్లూ వాటి గురించి ప్రత్యేకంగా చెప్పరు. రికవరీ సందర్భంలో ఎవరికిపడితే వాళ్లకు ఫోన్లు చేసేటప్పుడు మాత్రం మాకు ఆ అధికారం ఉంది, ఈ అధికారం ఉంది, మీరు సంతకాలు చేయలేదా అంటూ దబాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆగడాలకు ఆర్‌బీఐ అడ్డుకట్ట వేసే దిశగా కదలటం స్వాగతించాల్సిన పరిణామం.