NTV Telugu Site icon

గ్రేట్ టాలెంట్.. ఖమ్మంతో పెట్టుకుంటే కుమ్ముడే..!!

ఇటీవల కాలంలో ఖమ్మం వ్యక్తులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వాళ్లు తమ టాలెంట్‌తో వార్తల్లో నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు. మన్ననలే కాదు పాపులర్ కూడా అయిపోయారు. జెమినీ టీవీలో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు, మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్‌-5 షోలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఏకంగా రూ.కోటి గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. తాజాగా బిగ్‌బాస్‌-5 షోలో టైటిల్ విన్నర్ సన్నీ కూడా ఖమ్మం జిల్లా వాసే కావడం విశేషం. ఇలా రెండు పాపులర్ షోలలో ఖమ్మం జిల్లా వ్యక్తులు తమ సత్తా చాటడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంతో పెట్టుకుంటే మాములుగా ఉండదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read Also: భీమ్లా నాయక్ వాయిదా వెనుకున్నది అతనేనా..?

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రూ.కోటి గెలుచుకున్న రవీందర్ ఖమ్మం జిల్లాకు చెందిన సీఐడీ సైబర్‌ క్రైమ్ సబ్‌‌ఇన్‌స్పెక్టర్. ఖమ్మం సుజాతనగర్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్‌.ఎస్‌ రాజు, శేషుకుమారి దంపతుల సంతానమైన భాస్కర్‌ రాజా రవీంద్ర 2000 – 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్‌ సుల్తాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేశాడు. అనంతరం సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసి దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర… పిస్టల్, ఎయిర్‌ రైఫిలింగ్‌లో దిట్ట. రవీంద్ర ఇప్పటికే జాతీయ స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని రెండుసార్లు బంగారు పతకాలు, రెండుసార్లు రజత పతకాలు, ఒకసారి కాంస్య పతకం సాధించాడు.

Read Also: ఈ ఏడాదిలోనే ఈరోజు చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?

మరోవైపు బిగ్‌బాస్-5 షోలో పాల్గొన్న సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. 1989 ఆగస్టు 17న ఖమ్మంలో జన్మించిన సన్నీ… ఖమ్మంలోనే ఇంటర్ చదివాడు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో ఉన్న సన్నీకి తన తల్లి కళావతి కూడా సపోర్ట్ చేయడంతో ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడు. చిన్న వయస్సులో సన్నీ వేసిన ‘అల్లాద్దీన్’ అనే నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఓ ఛానెల్‌లో ‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే ఛాన్స్ రావడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా కొంతకాలం పని చేశాడు. అనంతరం జీతెలుగు ఛానల్‌లో ప్రసారమైన ‘కళ్యాణ వైభోగం’ సీరియల్‌లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సన్నీ.. త్వరలో విడుదల కానున్న ‘సకల గుణాభిరామ’ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు.