NTV Telugu Site icon

‘మా’ ఎలక్షన్స్ : దీనికి కూడా పనికిరామా ? రవిబాబు ఇన్ డైరెక్ట్ కౌంటర్

‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్లంతా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు కూడా దీనికి కూడా పనికిరామా ? అంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు ముందు బయటకు రావడమే కాకుండా ఏకంగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు.

“ఇది లోకల్, నాన్ లోకల్ గురించి కాదు. నేను ఈ ప్యానల్ కు ఓట్లు వేయండి, ఆ ప్యానల్ కు ఓట్లు వేయండి అని చెప్పట్లేదు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు మన సినిమాలు తీసే వారు మన క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేసి బయట క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి, వారి డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుంటారు. మన ఫిల్మ్ మేకర్స్ ఇతర భాషల నుండి హీరోయిన్స్, నటులను తీసుకొస్తారు. మన తెలుగు నటీనటులు తమ సినిమాలలో ఆ ప్రత్యేక పాత్రకు తగినవారు కాదేమో. వారి వల్ల డబ్బింగ్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తాయేమో. అందుకే ఇది దర్శకులు మరియు నిర్మాతల ఎంపిక కావచ్చు. ఎందుకంటే వారు తమ సొంత డబ్బును పెట్టారు. కాబట్టి ఇందులో తప్పు ఏమీ లేదు. ఆ బయట నుంచి వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టుల అదృష్టం. మన క్యారెక్టర్ ఆర్టిస్టుల దురదృష్టం.

Read Also : కాళ్ళు పట్టుకున్నావ్… ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డ మంచు విష్ణు

హైదరాబాద్‌లో దాదాపు 150 నుంచి 200 మంది తెలుగు కెమెరామెన్‌లు నెలరోజులుగా పని లేకుండా ఉన్నారు. అయితే మన మేకర్స్ బయట నుంచి కెమెరామెన్‌లను తీసుకొచ్చి, వారికి భారీగా చెల్లించి, వారి డిమాండ్స్ తీరుస్తున్నారు. ఈ కెమెరామెన్‌ల అవుట్‌డోర్ యూనిట్ బిల్లులు చూసి నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. మన కెమెరా మెన్ లకు అంత టాలెంట్ లేదు. వాళ్లకు సూపర్ ట్యాలెంట్ ఉంది అందుకే వాళ్ళనే తీసుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. చివరకు మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్ లను కూడా బాంబే నుంచి తీసుకొస్తున్నారు. మన టెక్నిషియన్స్ దౌర్భాగ్యం అనుకుందాం. మన మూవీ ఆర్టిస్టులందరం కలిసి ‘మా’ అనే చిన్న అసోసియేషన్ ను పెట్టుకున్నాము. ఎందుకు ? ప్రొడ్యూసర్స్ తో, డైరెక్టర్స్ తో సమస్యలు వస్తే చర్చించడానికి, పరిష్కరించుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ ను పెట్టుకున్నాము. ఇలాంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ ను రన్ చేయడానికి కూడా మనలో ఒకడు సరిపోడా ? దీనికి కూడా ఒకరిని బయట నుంచి తీసుకురావాలా ? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను ఇది లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కాదు” అంటూ వీడియోను పోస్ట్ చేశారు రవిబాబు. ఈ ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.