ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండగా మారి ఏపీలో విజృంభించింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలకు 28 మంది మృతి చెందగా, 17 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారికోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు గండ్లు పడడంతో వరద నీరు గ్రామాల్లోకి చేరింది. 1,316 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.33 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా వరదల్లో వేలాదిగా పశువులు కొట్టుకుపోయాయి. 4 జిల్లాల పరిధిలో సుమారు 1,533 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. వరదలతో పలు రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో 101 రైళ్లు రద్దు చేయగా, 108 రైళ్లను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే చెరువులు నిండుకుండల్లా మారాయి. చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్న చోట అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.