NTV Telugu Site icon

700 మంది రైతులు అమరులైనా డేటా లేదా..?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంటూ దేశ రాజధాని శివార్లలో రైతు సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి.. కేంద్రం ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకున్నా.. మరికొన్ని డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చలి, ఎండ, వాన ఇలా ఏదీ లెక్కచేయకుండా ఆందోళన చేసిన రైతులు చాలా మంది వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కన్నుమూశారు.. అయితే, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందిస్తూ.. రైతులు మృతిచెందారా? మాకు తెలియదే? అంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై లోక్‌సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. కిసాన్ ఆందోళ‌న‌లో 700 మంది రైతులు అమ‌రుల‌య్యారు.. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాప‌ణ‌లు కూడా కోరారు, కానీ, ఆ అమ‌ర రైతుల డేటా ప్రభుత్వం ద‌గ్గర లేదా? అంటూ మండిపడ్డారు.

Read Also: సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు.. ఆ తర్వాత రాజకీయాల్లో ఉండను..!

ఇక, కొత్త వ్యవసాయ చట్టాలతో త‌ప్పు చేసిన‌ట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నారని, కానీ, వ్యవ‌సాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల స‌మాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.. న‌వంబ‌ర్ 30వ తేదీన వ్యవ‌సాయ మంత్రిని ప్రశ్నించ‌గా.. త‌మ వ‌ద్ద మ‌ర‌ణించిన రైతుల డేటా లేద‌ని చెప్పిన‌ట్లు రాహుల్ గుర్తుచేశారు.. సాగు చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల‌కు పంజాబ్ ప్ర‌భుత్వం న‌ష్టప‌రిహారం ఇచ్చిందన్న రాహుల్.. త‌న ద‌గ్గర ఆ లిస్టు ఉంద‌ని, దాన్ని హౌజ్‌లో పెట్టామ‌న్నారు. హ‌ర్యానాలోనూ అమ‌ర రైతు కుటుంబాల‌కు ప‌రిహారం ఇచ్చిన‌ లిస్టు కూడా స‌భ‌లో పెట్టామ‌న్నారు. ఇలాంటి సంద‌ర్భంలో రైతులు ఎవ‌రూ చ‌నిపోలేద‌ని ప్రభుత్వం ఎలా చెబుతుంద‌ని నిలదీసిన ఆయన.. క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ.. రైతులకు పరిహారం కూడా అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. కాగా, కిసాన్‌ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించిన విషయం విదితమే.