కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి రోశయ్య మరణంపై వివరాలను తెలుసుకున్నారు.
Read Also: రాజకీయాలలో ఓ శకం ముగిసింది : చిరంజీవి
ఈ సందర్భంగా రోశయ్యతో తన అనుబంధం గురించి కేవీపీతో రాహుల్ గాంధీ మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రోశయ్య మరణవార్త తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆమె రోశయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాగా రోశయ్య మృతి పట్ల ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు, ఆర్థిక రంగ నిపుణులు సంతాపం తెలుపుతూ తమ అనుబంధం గురించి పంచుకుంటున్నారు.
