పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీని నడిపించబోతున్నట్టు కెప్టెన్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. మరి కొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్ వలన కాంగ్రెస్‌కు కొంత నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. మొదటి నుంచి సిద్ధూను అమరీందర్ సింగ్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
Read: కేజ్రీవాల్ హామీలపై వెల్లువెత్తున్న విమర్శలు…
ఆయన వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం సిద్ధూకు పీసీసీ పదవి అప్పగించింది. అంతేకాదు, అమరీందర్‌ను ముఖ్యమంత్రిగా తొలగించడంతో మనస్థాపానికి గురయ్యాడు. బీజేపీతో, అకాలీదళ్ చీలిక వర్గంతో పొత్తు ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అమరీందర్ సింగ్ తెలిపారు. చదువుకునే రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాల నాయకులను కలుస్తానని, వారిని కలుపుకొని పార్టీని నడిపిస్తామని చెబుతున్నారు అమరీందర్ సింగ్.
