పంజాబ్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్ రైతులే ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఈ సమయంలో అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం వలన ఉపయోగం ఉండదు. పైగా బీజీపీకి మరింత చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఈ కారణం చేతనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు. కాంగ్రెప్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పంజాబ్ ప్రజలకు తాను మాత్రమే న్యాయం చేయగలనని భరోసా ఇచ్చారు.
Read: పొంచి ఉన్న ఐఎస్ ముప్పు… ఆరు నెలల్లో దాడి జరగవచ్చు…
కాగా అమరీందర్ సింగ్ పార్టీని ఏర్పాటు చేయడం కొత్తేమి కాదు. 1980లో కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. 1984లో సిక్కుల ఊచకోతను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అకాలీదళ్ పార్టీలో చేరారు. అకాలీదళ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. బాదల్ కుటుంబంతో వచ్చిన విభేదాల కారణంగా బయటకు వచ్చి శిరోమణి అకాలీదళ్ (పంథిక్) పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు అంటే 1998లో కాంగ్రెస్‌లో చేరి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మరలా ఇన్నేళ్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీనైనా నిలుపుకుంటారా లేదంటే కొన్నాళ్ల తరువాత మరో పార్టీలో విలీనం చేస్తారా చూడాలి.
