ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై మంత్రి బొత్స ఇచ్చిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని.. అలాగే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ… ఎమ్మార్పీ అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప.. ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురకలు అంటించారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
Read Also: సినిమా టిక్కెట్ల ధరలు సరే.. నిత్యావసరాల ధరల పరిస్థితేంటి?: టీడీపీ ఎమ్మెల్యే
సినిమా టిక్కెట్ల ద్వారా గరిష్టంగా ట్యాక్స్ లభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తే… 100 శాతం టిక్కెట్ల అమ్మకాలను కంప్యూటరైజ్డ్ చేయాలని నిర్మాత శోభుయార్లగడ్డ హితవు పలికారు. మార్కెట్‌ను బట్టి సినిమా టిక్కెట్ ధర నిర్ణయించాలన్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారం నేపథ్యంలో ఏపీలో 50 థియేటర్లు మూతపడ్డాయని శోభు యార్లగడ్డ అన్నారు. దీని ప్రభావం రాబోయే చిత్రాల విడుదలపైనే కాకుండా.. దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ వ్యవస్థపైనా, తెలుగు సినీ పరిశ్రమపైనా తీవ్రస్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా ‘బాహుబలి’ సినిమాకు శోభు యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
