ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాత, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత జె. వి. ఫణీంద్ర రెడ్డి (వెంకట్) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. రవి చావలి దర్శకత్వం వహించిన ‘ది ఎండ్’ మూవీతో 2004లో తెలుగు సినిమా రంగంలోకి వెంకట్ అడుగుపెట్టారు. ఈ సినిమా నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా రవి చావలి దర్శకత్వంలో ‘సామాన్యుడు’, అలీతో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘మాయాజాలం’, ‘హంగామా’, వేణు హీరోగా ‘బహుమతి’, బి. జయ దర్శకత్వంలో ‘గుండమ్మ గారి మనవడు’, రవితేజతో ‘కిక్’, డాన్ శీను’, ఆది సాయికుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’, నానితో ‘పైసా’, నాగార్జునతో ‘ఢమరుకం’, మహేశ్ బాబుతో ‘బిజినెస్ మన్’, నితిన్ తో ‘విక్టరీ’ చిత్రాలను నిర్మించారు. ఇందులో కొన్ని చిత్రాలను అనుబంధ సంస్థలపై ప్రొడ్యూస్ చేశారు. అలానే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆంగ్లంలో ‘డివోర్స్ ఇన్విటేషన్’ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : శ్రీవారి సన్నిధానంలో దిల్ రాజు
57 సంవత్సరాల వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సోమవారం ఉదయం 5.30కి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రచారానికి దూరంగా ఉండే వెంకట్ చిత్రాల నిర్మాణ వ్యవహారాలను ఆయన సన్నిహితుడు సురేశ్ రెడ్డి పర్యవేక్షిస్తూ ఉండేవారు. అలానే నిర్మాత రమేశ్ పుప్పాల నేతృత్వంలోనూ వెంకట్ కొన్ని చిత్రాలను నిర్మించారు. వెంకట్ మృతిపట్ల సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
