Site icon NTV Telugu

పిల్లల్లో కరోనా.. సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వ ఆసుప్రతులు

గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెంది దాని ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాకుండా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ డేంజరస్‌ వైరస్‌ ప్రవేశించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) డేటా ప్రకారం.. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 మధ్య, కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌లలో 34.9 శాతం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలే ఉన్నారని బుధవారం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ చిన్నారులపై ప్రభావం చూపుతోందని.. అంతేకాకుండా ఒకవేళ ఇండియాలో కూడా చిన్నారులు కరోనా బారినపడితే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీడియాట్రిక్‌ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించి.. కరోనా సోకిన చిన్నారులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా ఆసుపత్రులలోని వార్డులను సిద్ధం చేసింది. పిల్లలు కరోనా బారిన పడిన ఎలాంటి భయంలేకుండా ఆసుపత్రులకు తీసుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు.

“గత కొన్ని నెలల్లో, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అంతటా నీలోఫర్‌తో పాటు ఇతర పిల్లల వైద్య సదుపాయాలలో వైద్య మౌలిక సదుపాయాలను సృష్టించింది. వాస్తవానికి, రాబోయే కొద్ది నెలల్లో, పిల్లల కోసం నీలోఫర్ ఆసుపత్రిలో మరో 800 నుండి 1,000 పడకలు ఏర్పాటు చేయనున్నాం.” అని నీలోఫర్ ఆసుపత్రి సీనియర్ శిశువైద్యుడు డాక్టర్ నరహరి బప్పనపల్లి పేర్కొన్నారు.

‘గాంధీ ఆస్పత్రిలో చిన్నారులకు చికిత్స అందించేందుకు పీడియాట్రిక్ విభాగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మేము ప్రత్యేకమైన 300 పీడియాట్రిక్ పడకలు కాకుండా తీవ్రమైన కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకమైన ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటు చేశాం. అయితే, ప్రజలు జాగ్రత్తలు పాటించి టీకాలు వేయించుకుంటే ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయని’’ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు చెప్పారు.

Exit mobile version