ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి కోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి పోలీసు ప్రత్యేక బృందాలు.. దాదాపు వారం రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా మంత్రి జాడ దొరకడం లేదు.. దీంతో.. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకుండా చర్యలు చేపట్టారు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది పోలీసు డిపార్ట్‌మెంట్..
కాగా, ఉద్యోగాల పేరుతో పలువురిని మోసగించిన కేసులో రాజేంద్రబాలాజీ ఆయన అనుచరులపై విరుదునగర్ క్రైం విభాగం పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే కాగా.. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.. ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన ఆయన.. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వెళ్లినా ఊరట దక్కలేదు. మరోవైపు.. ఆయనను అరెస్టు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.. విరుదునగర్, మదురై, కోయంబత్తూరు, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో రాజేంద్ర బాలాజీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.. అంతేకాదు.. పక్కరాష్ట్రాలైన కేరళ, కర్నాటకలోని పలు నగరాలలోనూ గాలింపు కొనసాగుతోంది. ఇక, విదేశాలకు కూడా పారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు.. ఎయిర్‌పోర్ట్‌ల దగ్గర ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
