Site icon NTV Telugu

ఏదో అనుకుంటే.. మరేదో.. పెట్రో బాదుడు తప్పదు..!

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు.. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్లెం పడుతుందని అంతా భావించారు.. పెట్రోలియం ఉత్పత్తి చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గిపోతాయని.. దీంతో.. పెట్రో ధరలతో పాటు.. పరోక్షంగా ఇతర వస్తువలపై కూడా ప్రభావం చూపుతుందనుకున్నారు.. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చే ప్రతిపాదనపై ఈసారి కూడా ఎలాంటి అంగీకారం కుదరలేదు. అత్యధిక పన్ను రాబడి తెచ్చే వీటిని జీఎస్టీలో చేర్చే ప్రతిపాదనను రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకించాయి. దీంతో ఈ ప్రతిపాదనపై పెద్దగా చర్చ జరగలేదని సమాచారం. అయితే, కేరళ హైకోర్టు సూచనల మేరకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని చర్చించామని, ఈ అంశాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించటమే కాకుండా ప్రస్తుతం ఇది సమయం కాదని స్పష్టం చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Exit mobile version