NTV Telugu Site icon

రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఏం తేలింది?

తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనుకుంటున్న తరుణలో ఆ ప్లేసును కాంగ్రెస్ భర్తీ చేస్తుందని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికకు వచ్చేసరికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇక్కడి ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు తమ క్యాండిడేట్లను ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీచేస్తారో ఇప్పటికీ తేలకపోవడంతో అంతా అయోమయంగానే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఆ నిరుత్సాహం ఇంకా పెరగకముందే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీక్రెట్ గా ఓ సర్వే చేయిస్తున్నాడట. ఈ సర్వే ద్వారానే కాంగ్రెస్ ఉప ఎన్నిక బరిలోకి దిగే అవకాశం ఉందని రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు.

2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఈ పార్టీ నుంచి గెలిచిన కొందరు టీఆర్ఎస్, బీజీపీల్లోకి వలసలు వెళ్లడంతో మిగతా నాయకులు పార్టీని పట్టించుకోలేదు. ఫలితంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరా పరాజయం పాలయ్యింది. అప్పటి వరకు రెండో ప్లేసులో ఉన్న పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్నామ్యాయం బీజేపీయే అన్నట్లు సాగింది. ఈ తరుణంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పోస్టుకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి అధిష్టానం టీపీసీపీ బాధ్యతలు అప్పగించింది.

కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. దళిత,గిరిజన దండోరా లాంటి సభలు పెడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.. అంతేకాకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేకంగా దామోదర నర్సింహకు బాధ్యతలు అప్పగించారు. అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ను కాపాడుకుంటున్నారు. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం పార్టీ తలామునకలవుతోంది. హుజూరాబాద్ బరిలో ఎవరుంటారా..? అనే విషయం ఇప్పటికీ తేలడం లేదు.

ఆ మధ్య పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పేర్లు బాగా వినిపించాయి. కొండా సురేఖ కొన్ని షరతులు పెట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెకు టికెట్ అనుమానమే అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు హుజూరాబాద్లో పోటీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరించడంతో కొత్త క్యాండెట్ ను హుజూరాబాద్ బరిలో దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఉప ఎన్నిక వాయిదా పడడంతో మరోసారి పార్టీలో ఉత్సాహం తగ్గింది.

ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో రేవంత్ రెడ్డి ఓ సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? టీఆర్ఎస్ పై ప్రజల అభిప్రాయమేంటి..? గతంలోని కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలు… ఇప్పటి సంక్షేమ పథకాలకు తేడా ఏంటి..? టీఆర్ఎస్ ఏ విషయంలో వైఫల్యం చెందింది..? కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు..? అభివృద్ధిపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ప్రజలకు ప్రస్తుతం కావాల్సిన అవసరాలేంటి..? కాంగ్రెస్ వారికి ఎలా ఇవ్వాలనుకుంటోంది..? లాంటి మరికొన్ని ప్రశ్నలను సంధిస్తూ సర్వే చేయిస్తున్నారట.

రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీగా ఉన్నాయి. మరుగున పడిన కాంగ్రెస్ ను పైకి తేవాలంటి ఇలాంటి సర్వేలు నిర్వహించి ఆ తరువాత ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి తాము చేసే పనులు, పథకాల గురించి వివరించనున్నారు.