NTV Telugu Site icon

సింగరేణికాలనీకి పవన్‌ కల్యాణ్.. చిన్నారి కుటుంబానికి ఓదార్పు

సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు.. సినీ నటుడు మంచు మనోజ్‌ తదితరులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చగా.. ఇవాళ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సింగరేణి కాలనీకి వెళ్లారు.. ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. దీంతో.. అపవన్‌ కల్యాణ్‌ కారు దిగడం కూడా సాధ్యపడని పరిస్థితి నెలకొంది.. ఈ సందర్భంగా అభిమానుల మధ్య తోపులాట జరిగింది.. ఇక, చిన్నారి ఇంటి దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. కారు వద్దకే ఆ కుటుంబాన్ని పిలిచి మాట్లాడారు పవన్‌ కల్యాణ్.

ఆరేళ్ల చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులతో మాట్లాడిన పవన్.. జరిగిన ఘటనకు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకున్నారు.. ఆ కుటుంబాన్ని ఓదార్చారు.. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జనసేనాని.. చాలా కలచివేసే సంఘటన ఇది.. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం సభ్యసమాజంలో చెప్పుకోలేని విధంగా జరిగిందన్నారు.. ఆడుకోవడానికి వెళ్లిన బిడ్డ కనిపించకుండా పోవడంతో.. ఆ కుటుంబం అల్లాడిపోయిందని.. అంతా వెతికినా కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారన్నారు. కానీ, ఆ చిన్నారి శవమై కనిపించడం అందరినీ కలచివేస్తోందన్నారు పవన్.. ఇలాంటి ఘటనలు రిపీట్‌గా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్. ఇక, ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటికైనా న్యాయం జరగాలి.. దయజేసి ప్రభుత్వ పెద్దలు.. సంబంధిత మంత్రులను పంపించి.. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి.. వారికి ఓదార్పు కల్పించండి అని సూచించారు.. బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో ఆలోచించాలన్న పవన్.. బిడ్డను కోల్పోయినవారి మనోభావాలు వేరుగా ఉంటాయని.. వాటిని అర్థంచేసుకోవాలన్నారు.. ఇక, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.