NTV Telugu Site icon

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీ ఎప్పుడంటే?

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వచ్చీరావడంతోనే సంచలనం రేపింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. బుక్​ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రైడింగ్ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఓలా ఎస్​ 1, ఎస్​ 1 ప్రో స్కూటర్​ డెలివరీలు ఇంకొంత కాలం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్ల డెలివరీ ఆలస్యానికి చిప్‌ల కొరతే కారణమని తెలుస్తోంది. దేశీయంగా చిప్ ల తయారీ అంతగా లేకపోవడంతో విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్​లో చిప్​ కొరత వేధిస్తుండటమే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలో జాప్యానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఓలా తన ఎస్​1, ఎస్​1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఆగస్టు 15న లాంచ్​ చేసింది. అక్టోబర్​ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ తర్వాతి కాలంలో నవంబర్​కు వాయిదా వేసింది. చివరగా డిసెంబర్​లో డెలివరీలు ప్రారంభమవుతాయిని ప్రకటించింది.

ఇలా నెలకోసారి డెలివరీ డేట్‌లు మార్చడంపై వినియోగదారులు అసహనంతో వున్నారు. మొదటి విడతలో బుకింగ్​ చేసుకున్న 100 మందికి మాత్రమే వాహనాలు డెలివరీ అయ్యాయి. బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. ఓలా ఎస్​1 వేరియంట్​ధర రూ. 99,999 వద్ద, ఎస్​1 ప్రో ట్రిమ్ వేరియంట్​ రూ.1,29,999 వద్ద విడుదలయ్యాయి. కేవలం రూ.499లతో వీటి బుకింగ్స్​ ప్రారంభించఇంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక బుకింగ్స్​ సాధించి రికార్డు సృష్టించింది. తమిళనాడులో ఓలా స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ సీఈవో చెబుతున్నారు. రెండవ విడత బుకింగ్స్ జనవరిలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ముంబై, వైజాగ్, పూణె, అహ్మదాబాద్‌ నగరాల్లో వచ్చేవారంలో డెలివరీలు వుంటాయని సీఈవో తెలిపారు.