NTV Telugu Site icon

రివ్యూ: ‘నూటొక్క జిల్లాల అందగాడు’

101 JIllala Andagadu

అవసరాల శ్రీనివాస్ ది స్పెషల్ బాడీ లాంగ్వేజ్. ఏ పాత్ర పోషించినా ఆయన మార్క్ అందులో కనిపిస్తుంది. ఇక ‘చి.ల.సౌ.’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ సాదాసీదాగా కనిపించే అందాల సుందరి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, ప్రముఖ దర్శకుడు క్రిష్ సమర్పణలో ఈ సినిమాను శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సో… సూపర్ బజ్ తో జనం ముందుకు రావాల్సిన ఈ మూవీ… సెప్టెంబర్ 3న థియేటర్లలోకి నిశ్శబ్దంగా వచ్చేసింది.

ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంటాడు గొత్తి సత్యనారాయణ ఉరఫ్ జిఎస్ఎన్ (అవసరాల శ్రీనివాస్). అదే కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఉత్తరాది నుండి హైదరాబాద్ కు వస్తుంది అంజలి (రుహానీ శర్మ). తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన బట్టతలను విగ్గుతో జి.ఎస్.ఎన్. కవర్ చేస్తుంటాడు. అతనిలోని సెన్సాఫ్ హ్యూమర్ నచ్చి అంజలి ప్రేమించడం మొదలు పెడుతుంది. తనది బట్టతల అని తెలిస్తే అంజలి ఎక్కడ దూరమైపోతుందోననే భయంతో జీఎస్ఎన్ నిజాన్ని దాచిపెడతాడు. ఈ దాగుడు మూతల ఆట కారణంగా వారి ప్రేమ వ్యవహారం ఎలాంటి చిక్కుల్లో పడింది? అందులోంచి జీఎస్ఎన్ ఎలా బయట పడ్డాడు? అనేదే సినిమా కథ.

రెండేళ్ళ క్రితం హిందీలో వచ్చిన ఆయుష్మాన్ ఖురానా ‘బాలా’ ఈ చిత్రాన్ని స్ఫూర్తి అనిచెప్పొచ్చు. సీన్ టు సీన్ వాడేసుకోకపోయినా… మెయిన్ థీమ్ ను మాత్రం దాని నుండి తీసుకున్నారనేది అర్థమైపోతోంది. యుక్తవయసులోనే బట్టతల వచ్చిన హీరో అగచాట్ల చుట్టూనే ఈ సినిమా మొత్తం సాగుతుంది. అయితే ‘బాలా’లో హీరోయిన్ కు ఉండే బ్లాక్ కలర్ కాంప్లెక్స్ ఇందులో హీరో చెల్లెలి పాత్రకు అన్వయించారు. అయితే…. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను మలిచారు. బేసికల్ గా దర్శకుడు, రచయిత కూడా అయిన అవసరాల శ్రీనివాస్ ఈ మూవీకి రచన చేశారు. బహుశా హీరోగా తానే నటిస్తుండటం వల్ల కావచ్చు మెగాఫోన్ ను మాత్రం కొత్తవాడైన రాచకొండ విద్యాసాగర్ చేతిలో పెట్టారు. శక్తికాంత్ కార్తీక్ నేథ్య సంగీతం బాగుంది. పాటలూ కొన్ని వినసొంపుగానే ఉన్నాయి. బట్… థియేటర్ నుండి బయటకు వచ్చినా… హమ్మింగ్ చేసుకునే స్థాయిలో ఏదీ లేదు. రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది.

ఇవాళ్టి యూత్ హెయిర్ లాస్ ను లైఫ్ లోనే అతి పెద్ద సమస్యగా భావిస్తోంది. ఇక మూడు పదులు నిండకుండానే బట్టతల రావడాన్ని చాలామంది భరించడం కష్టం కూడా. అందుకే హెయిర్ ప్లాంటేషన్ సెంటర్స్, విగ్గుల తయారీ దుకాణాలు విపరీతంగా వచ్చేశాయి. కొందరైతే అందమైన జుత్తు కోసం లక్షల రూపాయాలను ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వారంతా ఈ మూవీలోని పాయింట్ కు చక్కగా కనెక్ట్ అవుతారు. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే… బట్టతలతో కనిపించడానికి ఇష్టపడని వారి శాతమే ఈ సమాజంలో ఎక్కువ. వారందరికీ ఈ సినిమా ద్వారా దర్శకుడు అందం అనేది ఓ భావన తప్పితే, అది నిజం కాదని, బట్టతల ఉన్నంత మాత్రాన అందంగా లేనట్టు కాదని బోధ చేసే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవమే అయినా…. ఎంతమంది ఈ చేదు నిజాన్ని అంగీకరిస్తారనేది చూడాలి! హీరో చివరిలో ఆ వాస్తవాన్ని గ్రహించి, ఆత్మన్యూనత నుండి బయటకు వచ్చినట్టు చూపడం బాగుంది. అదే సమయంలో హీరోయిన్ మనసు మార్చుకుని హీరోకు దగ్గర కావడానికి కారణం ఏమిటనేది దర్శకుడు కన్వెన్సింగ్ గా చూపించలేకపోయాడు. బట్టతల అనే చిన్న పాయింట్ తీసుకుని రెండు గంటల పాటు దర్శకుడు చేసిన కసరత్తు కూడా ఆసక్తికరంగా లేదు. హీరో స్నానఘట్టాలను కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అలాంటి సాగతీత సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. ఎడిటర్ కిరణ్‌ గంటి తన కత్తెరకు ఇంకాస్తంత పదునుపెట్టి ఉండాల్సింది. అవసరాల శ్రీనివాస్ రాసిన మాటలు ఆకట్టుకునేలా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.

నటీనటుల్లో… ముందు చెప్పినట్టు అవసరాల శ్రీనివాస్ ది ప్రత్యేక శైలి. అదే రీతిలో ఇందులో హీరో పాత్రను అవలీలగా చేసేశాడు. రుహానీ శర్మ స్వీట్ అండ్ సింపుల్ గా బాగుంది. రోహిణి హీరో తల్లి పాత్రలో మెప్పించింది. ఆఫీస్ బాస్ రవి ప్రకాశ్ గా ప్రతాప్ రుద్ర, హీరో స్నేహితుడు సత్తిపండుగా రమణ భార్గవ్, హీరోయిన్ తండ్రిగా శివన్నారాయణ చక్కగా నటించారు. సినిమా ప్రారంభంలోనే కృష్ణ భగవాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. వీళ్ళందరి నటన చక్కగా ఉంది. అయితే… ఎంచుకున్న పాయింట్ ను ఎఫెక్టివ్ గా చెప్పలేకపోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. దాంతో ఈ గుడ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
నటీనటుల నటన
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
సాగతీతగా సెకండ్ హాఫ్
ఊహకందే ముగింపు

రేటింగ్ : 2.75 / 5

ట్యాగ్ లైన్: ఆనందమే అందం!

Show comments