భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శకం ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది… ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే.. తన కుమారుడు విజయేంద్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేశారు.. కానీ, ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించుకున్న యడియూరప్ప ఆశలపై నీళ్లు చల్లింది హైకమాండ్. డిప్యూటీ సీఎం పోస్టు కాదు కదా..! కనీసం మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, ఆయన వర్గీనికి షాక్ తగిలింది.
అయితే, బీజేపీ హైకమాండ్ యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్రతో మాట్లాడిందని, తనకు ఏమీ తెలియదంటూ సైలెంట్‌గా ఈ వ్యవహారం నుంచి తప్పించుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజ్ బోమ్మయ్… మరోవైపు.. యడియూరప్పకు బీజేపీలో సముచిత స్థానం ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని సమాచారం. తనకు సీఎం పదవి దూరం అయినా.. తన కుమారుడు విజయేంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవి కచ్చితంగా వస్తుందని ఊహించారు.. కానీ, ఉప ముఖ్యమంత్రి పదవి కాదు కదా కనీసం మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు యడియూరప్ప. ఇక, ఆయన అంచనాలు తలకిందులు కావడంతో ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది. యడియూరప్ప అనుకున్నవి వంద శాతం రివర్స్ అయ్యాయని రాజకీయ నాయకులు అంటున్నారు. సీఎం పదవి ఊడిపోయి 10 రోజులు కూడా కాకముందే బీజేపీ మీద యడియూరప్ప పట్టుకోల్పోయారని, ఇప్పుడు ఆయన గురించి బీజేపీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. యడియూరప్ప ప్రియ శిష్యుడిగా పేరున్న బసవరాజ్ బోమ్మయ్ సీఎం అయినా.. ఆయనకు మాత్రం వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
