NTV Telugu Site icon

ఆ సామాన్యురాలి గురించే సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌…!!

ఇటీవ‌లే దేశ అత్యున్న‌త పుర‌స్కారాల‌ను భార‌త ప్ర‌భుత్వం ప్ర‌కటించింది.  రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప‌ద్మా అవార్డుల కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.  ఈసారి అనేక మంది సామాన్యులు ప‌ద్మా అవార్డులు అందుకున్నారు.  అందులో ఒక‌రు తుల‌సి గౌడ‌.  తుల‌సి గౌడ అని పిల‌వ‌గానే సంప్ర‌దాయ‌క దుస్తుల్లో క‌నీసం చెప్పులు కూడా లేకుండా వ‌చ్చిన అ అడ‌వి త‌ల్లిని చూపి రాష్ట్ర‌ప‌తి ద‌ర్భార్ హాల్ మురిసిపోయింది.  అవార్డును అందుకున్న తుల‌సి గౌడ ఎవ‌రు?  ఎంటి అనే విష‌యాలు తెలుసుకోవ‌డానికి నెటిజ‌న్లు గూగుల్ బాట పట్టారు.  

Read: కిడ్నాపైన యువ‌తిని కాపాడిన టిక్‌టాక్‌…

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని అంకోలా తాలూకాలోని హోన్నాలి గ్రామానికి చెందిన తుల‌సి గౌడ గ‌త ఆరు ద‌శాబ్దాలుగా ప‌ర్యావ‌ర‌ణానికి సేవ చేస్తున్న‌ది.  ఆరు ద‌శాబ్దాల కాలంలో 40 వేల మొక్క‌లు నాటి ప‌ర్యావ‌ర‌ణానికి ఎన‌లేని సేవ చేసింది.  త‌న చిన్న‌త‌నంలోనే తండ్రి మ‌ర‌ణించ‌డంతో త‌ల్లితో కూలిప‌నులు చేస్తూ జీవ‌నం సాగించిన తుల‌సి గౌడకు 12 ఏళ్ల వ‌య‌సులో వివాహం జ‌రిగింది.  కొన్నాళ్లకే భ‌ర్త మ‌రణించ‌డంతో జీవితంలో క‌మ్ముకున్న చీక‌ట్ల‌ను తొల‌గించుకోవ‌డానికి అడ‌విలోని చెట్ల‌తో మ‌మేకం అయింది.  అప్ప‌టి నుంచి ప‌చ్చ‌ని ప‌కృతితో స్నేహం చేసింది.  మొక్క‌ల‌ను నాట‌డం, వాటిని సంర‌క్షించ‌డం చేస్తూ వ‌చ్చింది.  ఆమె ఔగాద్యాన్ని గ‌మ‌నించిన అటవీశాఖ తాత్కాలిక ఉద్యోగిగా నియ‌మించారు.  అనంత‌రం ఆమెను శాశ్వ‌త ఉద్యోగిగా నియ‌మించారు.  14 ఏళ్ల‌పాటు సేవ‌లు అందించిన తుల‌సి గౌడ విధుల నుంచి రిటైర్ అయ్యారు.  ఇప్ప‌టికీ అడ‌విలోనే అడ‌వి మొక్క‌ల మ‌ధ్య జీవ‌నం సాగిస్తున్నారు.