Site icon NTV Telugu

ఏపీలో రాజకీయం పరాకాష్టకు చేరుతోంది: నాగబాబు

naga babu

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సుదీర్ఘమైన పోస్టును పెట్టారు. ఏపీలో రాజకీయ భవిష్యత్‌ను తలుచుకుని బాధపడాలో లేదా భయపడాలో తెలియని దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయ్యి ఉండొచ్చని… కానీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత కన్నీటి పర్యంతం కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: భూవివాదంలో చిక్కుకున్న వైసీపీ మహిళా మంత్రి

ఏపీలో రాజకీయం నానాటికీ పరాకాష్టలకు నిలయంగా మారుతోందని.. ఒకరు ముఖ్యమంత్రిని బోసిడీకే అని దూషిస్తారని… మరొకరు మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యపదజాలంతో కించపరిచి హీనాతిహీనమైన విలువలు లేని వ్యక్తులుగా నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప… వారిని తిట్టడం లేదా వారి కుటుంబాలను దూషించే అధికారం ఎవరికీ ఏ మాత్రం లేదన్నారు. గతంలో తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ను, తన కుటుంబాన్ని ఇలాగే అనుచితంగా విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా… ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నానని నాగబాబు తెలిపారు. ఇది అనాగరికమని, సాటి మనుషుల పట్ల క్రూరత్వంగా ప్రవర్తించడమని చెప్పారు.

‘ఒకరు చేసింది తప్పని అనిపిస్తే ప్రశ్నించండి, నిలదీయండి లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి. కానీ ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండి. ఏ పార్టీ అయినా సరే… ఏ నాయకుడైనా సరే … తోటివారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి ఇకనైనా మనుషులుగా మారుతారని ఆశిస్తున్నా’ అంటూ నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version