టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతిపై మిస్టరీ వీడింది. అయితే ఏకే రావు మృతికి వారం రోజుల ముందునుంచే హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. ఓ మృతదేహం బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కనిపించడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృదేహం ఏకే రావుగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే వారం రోజులుగా కనిపించకుండా పోయిన హరిణి కుటుంబ సభ్యులు రైల్వే పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు.
అంతేకాకుండా ఏకేరావుది హత్యేనని వారు ఫిర్యాదు చేశారు. అప్పటివరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మర్డర్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకే రావును సంస్థలో ఆర్థిక లావాదేవీలపై హత్య చేసుంటారనే కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏకే రావు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో ఏకే రావుది ఆత్మహత్యగా పోలీసులు తేల్చేశారు. రైలు పట్టాలపై పడడంతో షాక్ గురైనట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైందని బెంగుళూరు పోలీసులు తెలిపారు. చేతి మణికట్టు, గొంతుపై స్వల్ప గాయాలయ్యాయని కానీ.. హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని బెంగుళూరు పోలీసులు స్పష్టం చేశారు.