వరుసకు బాబాయ్.. తండ్రి తర్వాత తండ్రిలా కాపాడాల్సిన వాడు. కానీ పసిపిల్లాడిని కిరాతకంగా చంపేశాడు. మైలార్ దేవ్ పల్లి లో నాలుగు సంవత్సరాల బాలుడు లక్ష్మీ నరసింహను హత మార్చిన కసాయి బాబాయి వీరేశంను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. హంతకుడు బాలుడి తల్లి మహేశ్వరి చెల్లి భర్త. స్వయానా మరిది కావడం గమనించాల్సిన విషయం. గత కొన్ని రోజులుగా బాలుడు తల్లి మహేశ్వరి చెల్లిని వేధిస్తున్నాడు మరిది వీరేశం.
భర్త వేధింపులు భరించలేక తనకు విడాకులు కావాలంటూ పట్టుబట్టింది చెల్లి. దీంతో మహేశ్వరి మరిదిని పిలిచి మందలించింది. నీ ప్రవర్తన మార్చుకోవాలంటూ హెచ్చరించింది బాలుడి తల్లి మహేశ్వరి. నన్నే బెదిరిస్తావా అంటూ ఆవేశంతో ఊగిపోయిన వీరేశం ఏదో ఒకటి చేయాలని పథకం పన్నాడు. గత రాత్రి ఫోన్ చేసి నా సంసారంలో నీవు జోక్యం చేసుకోవద్దు అంటూ వదిన మహేశ్వరికి వార్నింగ్ ఇచ్చాడు. లేదంటే.. నీ అంతు చూస్తానంటూ ఫోన్లో బెదిరించాడు వీరేశం.
నిన్న ఉదయం మహేశ్వరి ఇంటికి వచ్చి బాలుడిని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు వీరేశం. మధుబన్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి బాలుడిని అతికిరాతకంగా హత్య చేశాడు కసాయి బాబాయ్ వీరేశం. బాలుడిని హత్య చేసిన తరువాత అక్కడి నుండి పారిపోయాడు హంతకుడు. బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు కుటుంబ సభ్యులు. ఎక్కడా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో మైలార్ దేవ్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది తల్లి మహేశ్వరి. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్ట్టారు పోలీసులు. ఎట్టకేలకు వీరేశంని అరెస్ట్ చేశాక బాలుడిని చంపినట్టు అంగీకరించాడు. పసిపిల్లాడిని కిరాతకంగా చంపిన కసాయి బాబాయ్ వీరేశంని కఠినంగా శిక్షించాలని తల్లి మహేశ్వరి, కుటుంబ సభ్యులు పోలీసుల్ని కోరుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.