NTV Telugu Site icon

అమిత్‌షాకు సీఎం లేఖ.. మా మంత్రులకు హిందీ రాదు.. సీఎస్‌ను మార్చండి..!

హిందీ కొన్ని రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారుతోంది.. అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య కమ్యూనికేషన్‌ లేకుండా చేస్తోంది లాంగ్వేజ్‌.. చివరకు మా వళ్ల కాదు బాబోయ్ అంటూ కేంద్రానికి లేఖ రాసేవరకు వెళ్లింది పరిస్థితి.. ఇంతకీ హిందీ భాష ఇబ్బందిపెడుతోన్న ఆ రాష్ట్రం ఏంటి..? ఆ లేఖ సంగతి ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు మిజోరాం ముఖ్యమంత్రి పూ జోరంతంగ.. త‌మ కేబినెట్‌లోని మంత్రుల‌కు హిందీ రాదని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. మీజో భాష తెలియ‌ని చీఫ్ సెక్రట‌రీతో చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. అంతేకాదు.. సీఎస్‌గా ఉన్న రేణూ శ‌ర్మను వెంటనే మార్చాల‌ని లేఖలో షాకు విజ్ఞప్తి చేశారు.

హిందీ బాధ లేకుడా గ‌తంలో త‌న వ‌ద్ద అద‌న‌పు సీఎస్‌గా పనిచేసిన జేసీ రామ్‌తంగ‌ను కొత్త సీఎస్‌గా నియమించాలని లేఖలో అమిత్‌షాను అభ్యర్థించారు సీఎం పూ జోరంతంగ.. మిజోరాం ప్రజ‌ల‌కు హిందీ భాష అర్థం కాదని.. చివరకు తమ కేబినెట్‌లో ఉన్న మంత్రుల‌కు కూడా ఒక్కరికీ హిందీ రాదని షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం.. అంతేకాదు కొంద‌రికి ఇంగ్లీష్ భాష‌తోనూ స‌మ‌స్య ఉందని.. హిందీ, ఇంగ్లీష్ రాని మంత్రుల‌తో.. మీజో భాష తెలియ‌ని వ్యక్తి చీఫ్ సెక్రట‌రీగా ప‌నిచేయ‌డం ఇబ్బందిగా మారుతుంద‌ని పేర్కొన్నారు.. కాగా, న‌వంబ‌ర్ 1వ తేదీన సీఎస్‌గా బాధ్యత‌లు స్వీక‌రించాలంటూ రేణూ శ‌ర్మకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు అదేరోజు సీఎస్‌గా బాధ్యత‌లు చేప‌ట్టాల‌ని అద‌న‌పు సెక్రట‌రీ జేసీ రామ్‌తంగ‌ను సీఎం జోరంతంగ ఆదేశించారు. ఈ పరిణామంతో.. ఆ రాష్ట్రానికి ప్రస్తుతం ఇద్దరు సీఎస్‌లు ఉన్న పరిస్థితి.. దీంతో.. సీఎస్‌ను మార్చాల‌ని అమిత్‌షాకు లేఖ రాశారు మిజోరాం సీఎం.