హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పరకాల, నడికూడ, రేగొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లు మాట్లాడారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. నేలరాలిన మిర్చిపంటలను మంత్రులకు చూపిస్తూ.. సర్వం నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. తమను ఆదుకోవాలని మహిళా రైతులు మంత్రి కాళ్లపై పడడం అక్కడివారిని కలిచివేసింది.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటల దెబ్బతిన్నాయన్నారు. రైతులు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. చేతికొచ్చిన మిరప నేలరాలిందని, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లో మిర్చి దెబ్బతిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంటనష్టం పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నామన్నారు. రైతులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామన్నారు.