Site icon NTV Telugu

మిథాని ఫ్లై ఓవర్‌కు అబ్దుల్ కలాం పేరు

హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు. రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు.

2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్‌డీపీ కింద ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయింది. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా, కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు తప్పనున్నాయి ట్రాఫిక్ తిప్పలు. భార‌త మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం ప‌ట్ల తెలంగాణ సర్కార్ తన అబిమానాన్ని చాటుకుంది. ఈ ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరును నామకర‌ణం చేసింది.

ఈ ఫ్లై ఓవ‌ర్‌కు మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం పేరును నామ‌క‌ర‌ణం చేస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు. డీఆర్‌డీవోలో ప‌ని చేసిన గొప్ప మ‌నిషి అబ్దుల్ క‌లాంకు ఇదే మా నివాళి అని కేటీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో ఓ ద‌శాబ్ద కాలం పాటు అబ్దుల్ క‌లాం నివాస‌మున్నార‌ని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న క‌లాంకు తెలంగాణ ప్రభుత్వం స‌ముచిత గౌర‌వం క‌ల్పించిందన్నారు. ఇక ఓవైసీ – మిధాని జంక్షన్ ఫ్లై ఓవ‌ర్‌ను ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మించిన‌ట్లు కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొంటూ.. వీడియోను షేర్ చేశారు. న‌గ‌రం తూర్పు ప్రాంతానికి, పాత‌బ‌స్తీకి వార‌ధిగా ఈ ఫ్లైవ‌ర్‌ను నిర్మించారు.

Exit mobile version