దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది… గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు, అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉండగా.. దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు తీసుకొచ్చింది.. ఇక, ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడావేసినట్టుగా చెబుతున్నారు.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం చట్ట సవరణ చేయాలని కేంద్రం భావిస్తోంది.. కాగా, గతంలోనే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను కాపాడాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని ప్రధాని సూచించారు..
Read Also: పీఆర్సీ పై వీడని పీటముడి.. సీఎంతో చర్చలు లేనట్టేనా..?
అయితే, ఇప్పటికీ 18 ఏళ్లు నిండకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి.. మరి ఇప్పుడు 21 ఏళ్లకు పెంచాలన్న ప్రభుత్వం నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక, ఆడ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడానికి ఈ ప్రతిపాదన ఎంతో ఉపయోగపడనుంది… బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి కూడా ఓ రూపం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. ఆడ పిల్ల పెరుగుతుందంటేనే.. ఎంతో భారంగా భావించే తల్లిదండ్రులు.. ఎలా ఆహ్వానిస్తారో వేచి చూడాలి. ఇక, పురుషుల వివాహ కనీస వయస్సు ప్రస్తుతం 21 ఏళ్లుగా ఉండగా.. అది కూడా పెంచేలా ప్రభుత్వం నిర్ణయం ఉండబోతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.