ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో అత్యంత సాంకేతికతో కూడిన హెలికాప్టర్ ఎంఐ. ఈ రకం హెలికాప్టర్లు క్యారియర్‌గా ఉపయోగపడుతుంటాయి. 20 నుంచి 30 మంది సైనికులను, యుద్దసామాగ్రిని చేరవేసేందుకు ఈ హెలికాప్టర్లను వినియోగిస్తుంటారు. సైనికుల అవసరాలకు అనుగుణంగా ఈ హెలికాప్టర్లలో ఆధునిక టెక్నాలజీని అప్డేట్ చేస్తుంటారు. టెక్నికల్‌గా అత్యున్నత శ్రేణికి చెందిన హెలికాప్టర్లే అయినప్పటికీ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. 2010 నుంచి 2021 వరకు ఎంఐ హెలికాప్టర్లు అనేకమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదాల వలన 43 మంది సైనికులు మృతి చెందారు.
Read: ఆరేళ్ల క్రితం మృత్యువును జయించి… ఇప్పుడు ఇలా…
2010 నవంబర్ 19 వ తేదీన తవాంగ్ నుంచి గౌహతి వెళ్తున్న ఎంఐ హెలికాప్టర్ మార్గమధ్యలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది సైనికులు మృతి చెందారు. 2012 ఆగస్ట్ 30 వ తేదీన గుజరాత్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఇకపోతే 2013 జూన్ 25 వ తేదీన కేదారినాథ్ వరదల్లో చిక్కుకున్న వారి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్టర్ గౌరీకుండ్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి.
2017 అక్టోబర్ 6 వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ అడవుల్లో కూలిపోయింది. దట్టమైన అటవీప్రదేశం కావడంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది మృతి చెందారు. ఇక 2021 డిసెంబర్ 8 వ తేదీన తమిళనాడులోని కూనూరు వద్ద వీవీఐపీలు ప్రయాణం చేసే ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో సహా 13 మంది మృతి చెందారు.