NTV Telugu Site icon

రివ్యూ: మాస్ట్రో మూవీ

Maestro

ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన ‘చెక్‌’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్‌’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ చిత్రం ‘అంథాధూన్’కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

కథ విషయానికి వస్తే పియానో ప్లే చేసే కళ్ళు లేని అరుణ్‌ (నితిన్) అనే ఒంటరి కుర్రాడి కథ ఇది. ఇళయరాజాను అమితంగా ఇష్టపడే అతనికి పియానో అంటే ప్రాణం. సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తాడు. తన పియానో పాడైపోవడంతో ఓ నైట్ క్లబ్ లో చేరి, పియానో ప్రాక్టీస్ చేస్తూ, కొంత డబ్బుల్ని వెనకేసుకుంటాడు. ఆ క్లబ్ ఓనర్ కుమార్తె సోషియా (నభా నటేశ్‌) అరుణ్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుంది. అదే సిటీలో ఉండే ఒకప్పటి హీరో మోహన్ (నరేశ్‌), అతని రెండో భార్య సిమ్రాన్ (తమన్నా) ఊహించని విధంగా అరుణ్‌ జీవితంలోకి వస్తారు. దాంతో ఈ బ్లైండ్ పియానో ప్లేయర్ లైఫ్ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ చిక్కుల్లోంచి అతను ఎలా బయటపడ్డాడు? అనేదే కథ.

మూడేళ్ళ క్రితం బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అంథాధూన్’ హిందీలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు, అనిల్ థావన్, మానవ్ విజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడి వాళ్ళు ఆదరిస్తారా? అనే సందేహం కొందరికి రాకపోలేదు. పైగా నితిన్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఈ థ్రిలర్ మూవీలో నటించి, మెప్పించగలడా? అనీ అనుకున్నారు. కానీ వారి అంచనాలు తప్పు అని నితిన్ తన నటనతో నిరూపించాడు. రాధికా ఆప్టే పోషించిన పాత్రను నభా నటేశ్ సైతం అవలీలగా పోషించింది. నిజానికి టబు పోషించిన థ్రిల్లింగ్ క్యారెక్టరే ఈ సినిమాకు ఆయువు పట్టు. ఆ పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేయడం ఓ రకంగా టఫ్ డెసిషన్. ఆమె సోఫియా పాత్ర పోషించడం తెలుగు వ్యూవర్స్ కు ఓ షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. గత వారం వచ్చిన ‘సీటీమార్’లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటించిన తమన్నా… అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేసింది. అయితే క్యారెక్టర్ లోని డెప్త్ దృష్ట్యా ఆమె పాత్రకు సొంత గొంతు కాకుండా డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది. ఒకప్పటి కథానాయకుడు మోహన్ పాత్రలోకి నరేశ్ పరకాయ ప్రవేశం చేశారు. ఆయన ఎంపిక చాలా యాప్ట్ గా ఉంది. రెండు మూడు సినిమాలలో నటించి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్న జిషు సేన్ గుప్తా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూట్ అయ్యారు. ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీముఖి, అనన్య, హర్షవర్థన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్, బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి తదితరులు కనిపిస్తారు.

సాంకేతిక నిపుణుల్లో మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎండ్ టైటిల్స్ లో వచ్చే ‘మాస్ట్రో’ టైటిల్ సాంగ్ బాగుంది. మూవీ స్టోరీని తెలియచేస్తూ, ఆయా పాత్రలతో సరదాగా డాన్స్ చేయించడం ఆకట్టుకుంది. ఆ పాట కొరియోగ్రఫీ కూడా చక్కగా ఉంది. ఇక నేపథ్య గీతాలుగా వచ్చే ‘ఓ బేబీ… ఓ బేబీ… చిన్ననవ్వే చాలే’, ‘అనగనగా అందమైన కథగా…’ కూడా ఫర్వాలేదు. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా వరకూ మాతృక లోని ఫ్రేమ్స్ తోనే సాగింది. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ ఓకే. సాహి సురేశ్ ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నరేశ్ కు సంబంధించిన పాత మూవీస్ పోస్టర్ ఫ్రేమ్స్ ను అతని ఫ్లాట్ లో పెట్టడం బాగుంది. నిజానికి మన గత కాలపు హీరోలు ఇలా పోస్టర్స్ కంటే… అప్పటి హండ్రెడేస్ ఫీల్డ్స్ ను ఆర్భాటంగా ఇళ్ళలో పెట్టుకుంటూ ఉంటారు. వాటినీ చూపించి ఉంటే ఇంకా బాగుండేది. ఓవర్ ఆల్ గా ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. అది తెర మీద కనిపిస్తోంది.

ఇలాంటి బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీస్ తెలుగులో రేర్ గా వస్తుంటాయి. ఒకవేళ అడపాదడపా వచ్చినా, పేరున్న హీరోలు చేయడం తక్కువ. కానీ నితిన్ నటుడిగా, నిర్మాతగా ఓ ధైర్యం చేశాడు. అందుకు అప్రిషియేట్ చేయాలి. పైగా ఆ పనిని బాగా చేశాడు కూడా. దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటిసారి ఓ రీమేక్ ను ట్రై చేశాడు. దాదాపు మాతృకనే ఫాలో అయినా, సోల్ చెడిపోకుండా బాగా తీశాడు. తెలుగువారి సెన్సిబులిటీస్ ను దృష్టిలో పెట్టుకుని అడల్ట్ సీన్స్ విషయంలో కొంత నియంత్రణ పాటించాడు. హిందీ సినిమాను చూసిన వాళ్ళకు ఇది రెప్లికా గా కనిపించవచ్చు కానీ మొదటి సారి తెలుగులో చూసిన వాళ్ళు కథలోని కొత్తదనాన్ని, నటీనటుల పెర్ఫార్మెన్స్ ను ఆస్వాదిస్తారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను థియేట్రికల్ రిలీజ్ కాకుండా… ఓటీటీలో విడుదల చేయడమే సబబు.

ప్లస్ పాయింట్
కథలోని కొత్తదనం
నటీనటుల నటన
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్
తెలుగు నేటివిటీ లేకపోవడం
కాస్తంత బోర్ కొట్టే ప్రీ క్లయిమాక్స్

రేటింగ్: 2.75 / 5

ట్యాగ్ లైన్: ‘మాస్ట్రో’ నయా ట్యూన్!

Show comments