NTV Telugu Site icon

ఎవరన్నారు బాలు లేరని… !?

Legendary singer SP Balasubrahmanyam Birth Anniversary

(జూన్ 4న బాలు జయంతి)
‘ఎవరన్నారు బాలు లేరని…!?’ ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ పై విధంగా చెబుతూ ఉంటాం. అవును, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని ఎవరన్నారు. అని మనగలమా? బాలు పాట తెలుగువారి ఆస్తి. దానిని దొంగిలించడం ఎవరి తరమూ కాదు. భౌతికంగా బాలును తీసుకు పోగలిగిన విధి బాలు పాటను, ఆయన పంచిన మధురామృతాన్నీ మన నుండి వేరు చేయలేకపోయింది. కరోనా కల్లోలం మొదలయిన రోజుల్లోనే బాధితుల కోసం బాలు ఓ నిధి ఏర్పాటుకై తన పాటతో నిధులు సేకరించారు. అది నచ్చక కాబోలు కరోనా ఆయననే కాటు వేసింది. అయితేనేమి, ఆయన నింపిన స్ఫూర్తితో కరోనా బాధితులను ఆదుకొనేందుకు ఎందరో అహరహం చేతనైనసాయం చేయడానికి కృషి చేస్తున్నారు. బాలు కోరుకున్నట్టు అతి త్వరలోనే కరోనా కరిగిపోతుంది. ఎందుకంటే దివికేగిన బాలు అక్కడ కూడా తన పాటలతో పరవశింప చేస్తూ ఉంటారు. నింగిలోని ఆ పాట మానవుల్లో ముఖ్యంగా శాస్త్రజ్ఞుల మనసులు తాకి, వారి మేధలో కరోనాను కరిగించే మందును తయారు చేసేలా చేయకమానదు.

బాలు పాటలేని తెలుగు సినిమాను ఊహించగలమా? ఘంటసాల గానంతో తెలుగు సినిమా స్వర్ణయుగం చూసింది. తరువాతి యుగానికి బాలు పాటనే బాటలు వేసింది. నాటి మేటి నటులకు, వర్దమాన కథానాయకులకు, హాస్యనటులకు అందరికీ బాలు గళం దన్నుగా నిలచి చిత్రసీమలో సిరుల వానలు కురిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా యావద్భారతంలోని పలు భాషల్లో పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక గీతాలు పాడిన గాయకునిగా చరిత్ర సృష్టించారు బాలు. “నా పాట పంచామృతం…” అంటూ బాలు పాడినట్టుగానే నిజంగా ఆయన పాట పంచామృతమే పంచింది. ఆ మధురామృతాన్ని మననం చేసుకుంటూనే అభిమానులు బాలు ఇంకా తమ మదిలోనే ఉన్నారు అని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నారు.

కేవలం గాయకునిగానే కాదు, నటునిగా, సంగీత దర్శకునిగా, గాత్రదాతగా ఏ ప్రక్రియ చేపట్టినా, అందులో తనదైన బాణీ పలికించి, అవార్డులూ రివార్డులూ సాధించారు బాలు. 23 నంది అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించిన బాలు, జాతీయ అవార్డుల్లోనూ ఆరుసార్లు ఉత్తమగాయకునిగా నిలచి తెలుగువారిని మురిపించారు. బాలు అన్నా అంటూ అభిమానించే ఏసుదాస్ 8 నేషనల్ అవార్డులతో అగ్రస్థానంలో నిలవగా, ఆ అన్నకు తగ్గ తమ్మునిగా తరువాతి స్థానంలో బాలు నిలిచారు. ఒకప్పుడు తినడానికి కూడా తీరికలేనంత బిజీగా సాగారు బాలు. తరువాతి రోజుల్లో కొత్తనీరుకు అవకాశమిస్తూ బాలు పాడటం తగ్గించి, నటనలో రాణించారు. ఆ తరువాత కూడా బిజీగా ఉండే ప్రయత్నమే చేశారు. ‘పాడుతా-తీయగా’ కార్యక్రమంలో వందలాది గాయనీగాయకులను తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారు. ఆ కార్యక్రమ నిర్వహణ సమయంలో బాలు నోట పలికిన పలు మాటలు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన తీర్చిదిద్దిన గాయనీగాయకులే కాదు, వారిని అభిమానించేవారు సైతం బాలు ఎక్కడికీ వెళ్ళలేదని, తమ మనసుల్లోనే నిలచి తమకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు.

ఇప్పుడు చెప్పండి… బాలు ఎక్కడికి వెళ్ళారు? ఆయన మన మనసుల్లోనే ఉన్నారు. ఆయన పాటలు మననం చేసుకున్న ప్రతీసారి మనలను పలకరిస్తూనే ఉంటారు.