(సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ పుట్టినరోజు)
లతా మంగేష్కర్ పుట్టినరోజు సంగీతప్రియులకు పండుగ రోజు. లత గళంలో జాలువారిన పాటలు అమృతతుల్యమై కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఆనందం పంచాయి. ఈ గానకోకిల పాటతోనే ఈనాటికీ తమ దినచర్య ప్రారంభించేవారు ఎందరో ఉన్నారు. లత పాటతోనే నిదురలోకి జానుకొనేవారూ లేకపోలేదు. లత పాట భారతీయులకు అనుక్షణం ఆనందం పంచుతూనే ఉంటుంది. మనసు బాగోలేనప్పుడు లత పాట వింటే చాలు ఇట్టే కుదుట పడిపోతాము అని దేశనాయకులు సైతం కొనియాడిన సందర్భాలున్నాయి. భారతరత్న
గా నిలచిన ఈ గానకోకిల సెప్టెంబర్ 28తో 92 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. వయసు వల్ల వచ్చిన గాత్రభేదం తప్పించి ఈ నాటికీ ఈ కోకిల పాటలో మధురం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
లత పుట్టడమే సంగీత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి పండిట్ దినానాథ్ మంగేష్కర్ ఆ రోజుల్లో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. ఆయన కచేరీలు అంటే దేశనాయకులు సైతం చెవికోసుకొనేవారు. తండ్రి వద్దనే సాధన ఆరంభించిన లత తరువాత సంగీతంలో అత్యున్నతంగా శిక్షణ తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె పసితనంలోనే తండ్రి కన్నుమూశారు. ఐదుమంది సంతానంలో లత అందరికన్నా పెద్ద. ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఆమె తరువాతి వారు. కుటుంబ పోషణ కోసం చిన్నతనంలోనే లత కొన్ని చిత్రాలలో బాలనటిగా నటించారు. తరువాత పాటతో పయనించారు. ఆమె గాత్రంలోని మాధుర్యం గమనించిన నౌషద్, సి.రామచంద్ర, ఎస్డీ బర్మన్, శంకర్-జైకిషన్, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి ఎంతగానో ప్రోత్సహించారు. తరువాతి తరం సంగీత దర్శకులు మదన్ మోహన్ వంటివారు లత పాటతోనే తమ ఉనికిని చాటుకున్నారు. అనేక చిత్ర విజయాలకు లత గానం తోడయింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా లత పాటకోసం సదరు చిత్రాలను తిలకించిన వారు ఉన్నారు. ఇంతటి గానవైభవం ప్రదర్శించిన లతకు 1972లో పరిచయ్
చిత్రంలో పాటలకు తొలి నేషనల్ అవార్డు లభించింది.
తరువాత 1974లో ఖోరా కాగజ్
, 1990లో లేకిన్
చిత్రాల ద్వారా మరో రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో నిలిచారు. ఆమె కీర్తి కిరీటంలో అనేక అవార్డులూ, రివార్డులూ రత్నాల్లా వెలుగొందుతూ ఉన్నాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, భారతరత్న అవార్డులు అందుకుని గానకోకిలగా తనదైన వైభవం ప్రదర్శించారు.
లతా మంగేష్కర్ స్వరకల్పనలోనూ కొన్ని చిత్రాలు రూపొందాయి. రామ్ రామ్ పవన, మరాఠా తిటుక మేల్వావా, మోహిత్యాంచీ మంజుల, సధి మనసే, తంబాడీ మతి
చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాలన్నీ లత మాతృభాష మరాఠీలో రూపొందడం విశేషం. వాదల్
మరాఠీ చిత్రంతో పాటు జాంజార్, కాంచన్ గంగ, లేకిన్
హిందీ చిత్రాలనూ లత నిర్మించడం విశేషం.
లతకు మన తెలుగు పాటతోనూ అనుబంధం ఉంది. 1955లో ఏయన్నార్ హీరోగా రూపొందిన సంతానం
చిత్రంలో లతా మంగేష్కర్ తొలిసారి తెలుగు పాట పాడారు. అందులో నిదుర పోరా తమ్ముడా...
అంటూ సాగే పాట లత నోట పలికినదే. ఆమెతో తొలి తెలుగు పాట పాడించిన ఘనత సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తిదే! తరువాత చాలా ఏళ్ళకు ఏయన్నార్ నటవారసుడు నాగార్జున హీరోగా రూపొందిన ఆఖరిపోరాటం
లో తెల్ల చీరకు తకధిమి...
పాటను ఇళయరాజా బాణీల్లో పాడారు లత. యన్టీఆర్ హిందీలో రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర
పాటల్లో కొన్ని లతా మంగేష్కర్ గానం చేశారు. 1999లో లతకు యన్టీఆర్ జాతీయ అవార్డు లభించింది. 2009లో ఏయన్నార్ నేషనల్ అవార్డునూ ఆమె అందుకున్నారు. దక్షిణాది భాషల్లోనూ మధురం పంచిన ఈ గానకోకిల హిందీ, మరాఠీ,బెంగాలీ, ఉర్దూ పాటలనే అధికంగా పాడారు. భారతీయ సంగీతం ఉన్నంత వరకూ లత పాట కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ గానకోకిల మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.