ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నేడు పుట్టినరోజు జరుపుకొంటోంది. మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొన్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృతి శెట్టి నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ క్యూట్ బ్యూటీ బర్త్ డే సందర్బంగా ఆమెకు సంబందించిన అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
నాని జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.
కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ లో ఈ బ్యూటీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఇటీవలే ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా కొనసాగుతోంది.
ఇక కృతి శెట్టి నటిస్తున్న మరో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ తో వచ్చిన సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. తను ప్రేమించిన అమ్మాయిగా నటిస్తోన్న కృతి శెట్టి పాత్ర గురించి సుధీర్ బాబు ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఈ చిత్ర కథాంశం.. నేడు ఆ అమ్మాయి (కృతి శెట్టి) పుట్టినరోజు సందర్బంగా చిత్రయూనిట్ బర్త్ డే విషెస్ తెలియజేసింది.
ప్రస్తుతం మాస్ట్రోతో మంచి హిట్ కొట్టిన యూత్ స్టార్ నితిన్ తోను కృతిశెట్టి ఓ సినిమా చేయనుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్ తో ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.