Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం

  • భక్తులతో కిక్కిరిసిన ప్రాంగణం
  • స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు
  • వైభవంగా శ్వేతార్క గణపతి కల్యాణం
  • మూషిక వాహన సేవతో ముగింపు
Ganapati

Ganapati

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం 2026’ ఐదో రోజు కార్యక్రమాలు అశేష భక్తజనసందోహం నడుమ కనులపండువగా ముగిశాయి. కార్తీక శుద్ధ నవమి సందర్భంగా నవంబర్ 18వ తేదీ బుధవారం నాడు నిర్వహించిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక, ధార్మిక వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పే ఈ దివ్య వేడుకల్లో భాగంగా నేడు నిర్వహించిన పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

స్వామీజీల అనుగ్రహ భాషణం.. ఆధ్యాత్మిక ప్రవచనామృతం

నేటి వేడుకల్లో భాగంగా వేర్పేడు శ్రీవ్యాసాశ్రమానికి చెందిన శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీ అసంగానందగిరి స్వామీజీ విచ్చేసి భక్తులకు అమూల్యమైన అనుగ్రహ భాషణం అందించారు. వారి దివ్యోపన్యాసంతో ప్రాంగమంతా ఆధ్యాత్మిక భావాలతో నిండిపోయింది. అలాగే ప్రముఖ విద్వాంసులు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి అందించిన ప్రవచనామృతం భక్తులకు చక్కటి ఆధ్యాత్మిక స్పూర్తిని అందించింది. కార్తీక మాస మహాత్యాన్ని, భక్తి మార్గ ప్రాముఖ్యతను వారు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

కోటిగరికార్చన , కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం

ఉత్సవాల్లో భాగంగా వేదికపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెజిమెంటల్ మహోగణపతికి వైభవంగా కోటిగరికార్చన చేపట్టారు. అలాగే భక్తులందరిచే గణపతి విగ్రహాలకు కోటిగరికార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక నేటి వేడుకలన్నింటిలోనూ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం’ నేత్రపర్వంగా సాగింది. ఈ దివ్య ఘట్టాన్ని కళ్లారా వీక్షించిన భక్తులు తరించిపోయారు. ఈ రోజు కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి తంగిరాల మాధవి దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కనులపండువగా స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు

సాయంత్రం వేళ కోటి దీపోత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వర్ణలింగోద్భవం, సప్తహారతుల కార్యక్రమం ప్రాంగణాన్ని ద్యుతిమంతం చేసింది. భక్తిశ్రద్ధలతో కనులవిందుగా సాగిన ఈ హారతుల కార్యక్రమం భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.

మూషిక వాహన సేవతో ముగిసిన ఐదో రోజు వేడుకలు

చివరిగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన మూషిక వాహనంపై స్వామివారి సేవ అత్యంత రమణీయంగా నిర్వహించబడింది. కార్తీక మాస పవిత్రతను ప్రతిబింబించేలా సాగిన ఈ కోటి దీపోత్సవ ఐదో రోజు కార్యక్రమాలు అశేష భక్తుల జయధ్వనుల మధ్య ప్రశాంతంగా, ఘనంగా ముగిశాయి. రానున్న రోజుల్లోనూ జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు రచనా టెలివిజన్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ యాజమాన్యం కోరారు.