ఏపీలో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస రావు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొడాలి, వంశీ, అంబటి, ద్వారంపూడి మాటలను వారి ఇంటి ఆడవాళ్లే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా వైసీపీ నేతల్లా మేము మాట్లాడగలం.. కానీ మాఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరంటూ మండిపడ్డారు.
చంద్రబాబు భద్రత తీసి వస్తే కొడాలి నాని ఏం చేస్తాడు..? కొడాలి నాని పెద్ద మగాడా..? అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అనుభవం ఎంత..? చంద్రబాబు అనుభవం ఎంత..? ప్రజలు వైసీపీని పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైసీపీకి ఘోరీ కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు అనేది ఒకటి ఉంటుంది అని వైసీపీ నేతలు మర్చి పోయినట్లు ఉన్నారు. ఈ రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు అంత ఒక పట్టుదలగా పని చేసి వైసీపీని కూకటివేళ్ళతో పెకిలిస్తాం. పల్నాడులో రోజు రోజుకి వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయి. ఈ రెండున్నరేళ్లుగా పల్నాడులో 80 మందికి పైగా టీడీపీ కార్యకర్తల కాళ్ళు చేతులు విరగొట్టి, 7మందిని పొట్టనపెట్టుకున్నారు. ఏపీలో నియంత పాలన ఉంది అంటూ ఆయన ఆరోపణలు చేశారు.