Site icon NTV Telugu

మన దగ్గరే అనుకుంటే పొరపాటే..! అక్కడ కూడా నేతల తిట్ల పురాణం..

రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కాస్తా శృతిమించి తిట్ల పురాణానికి దారితీస్తున్నాయి.. కొందరు నేతలైతే ఏకంగా రాయడానికి ఇబ్బందిగా ఉండే బూతులు తేలికగా మాట్లాడేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ నేత నోరు తెర్చినా.. బూతులు, సవాళ్లకు కొదవలేకుండా పోయింది. ఇక, ఎన్నికలు వస్తే చాలు.. నేతల బూతులతో టీవీలు మార్మోగుతున్నాయి. అయితే, ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అంటే పొరపాటే.. కర్ణాటకలో విధాన పరిషత్‌ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. పనిలోపనిగా తిట్ల పురాణం అందుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు.

Read Also: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌: దేశం విడిచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్..!

తాజాగా, మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను పనికిమాలిన దద్దమ్మ అంటూ ప్రతిపక్ష నేత సిద్దరామయ్య మండిపడితే.. దీనిపై ఘాటుగా స్పందించిన ఆయన.. కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యను పచ్చితాగుబోతుగా పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు తాగుతాడో తాగిన మత్తులో ఏం మాట్లాడుతారో తెలియదని వ్యాఖ్యానించారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ను ఉగ్రవాది అంటూ ఆరోపించిన సిద్దరామయ్య.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో తాను కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలవి తిట్లు కానప్పుడు తనవి మాత్రం ఎలా? అవుతాయని ఎదురుప్రశ్నిస్తున్నారు. ఇక, రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ రూపొందించారంటూ మాజీ ఎంపీ అనిల్‌ లాడ్‌ చేసిన వ్యాఖ్యలకు కూడా దుమారాన్నే రేపాయి.. వెంటనే అనిల్‌ లాడ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని బీజేపీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ డిమాండ్‌ చేశారు. అంతేకాదు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటీల్‌ను ఉగ్రవాదిగా సంబోధించినందుకు సిద్దరామయ్యపై కూడా కంప్లైంట్ చేశారు. ఇలా కర్ణాటకలోనూ నేతల మధ్య తిట్ల దండకం కొనసాగుతోంది.

Exit mobile version