Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ

  • కర్ణాటకలో షాకింగ్ పరిణామం
  • 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
  • ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Karnataka

Karnataka

కర్ణాటకలో షాకింగ్ పరిణామం వెలుగు చూసింది. యువతలో అత్యధిక హెచ్‌ఐవీ కేసులు నమోదు కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వయసు గల విద్యార్థులు, యువతలో 7 వేల మందికి పైగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో షాక్ అయింది. ఈ నేపథ్యంలో డీకే.శివకుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో హెచ్‌ఐవీ అవగాహన, కౌన్సెలింగ్, పరీక్షా శిబిరాలను నిర్వహించాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల అనుమతి లేకుండా ఎవరికీ హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.

కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం సిఫార్సుల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాలేజియేట్ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. యువతలో హెచ్‌ఐవీపై అవగాహన పెంచడం, స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, అవసరమైన వారికి ప్రారంభ దశలోనే చికిత్స అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.

కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం గణాంకాల ప్రకారం.. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో హెచ్‌ఐవీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2023-24లో ఈ వయసు విభాగంలో 44,500 మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య 66,600కు పెరిగినట్లు సమాచారం. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయసు గల విద్యార్థులు, యువతలో 7 వేల మందికిపైగా ఇటీవల హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కాలేజీ స్థాయిలో అవగాహన, స్వచ్ఛంద పరీక్షలను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. దేశంలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి సంఖ్యలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా.. వారిలో 2.05 లక్షల మంది మాత్రమే యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మరో 54 వేల మందికి తమకు హెచ్‌ఐవీ సోకిన విషయం ఇంకా తెలియకపోవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరా?

కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, హెచ్‌ఐవీ పరీక్షా శిబిరాలను నిర్వహించడం తప్పనిసరి అయినప్పటికీ.. విద్యార్థులకు హెచ్‌ఐవీ పరీక్షలు మాత్రం తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థి పూర్తి అవగాహనతో అంగీకారం తెలిపిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛంద పరీక్షలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు.

హెచ్‌ఐవీపై అవగాహన పెంచేందుకు కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం క్యూఆర్ కోడ్ ఆధారిత హెచ్‌ఐవీ సెల్ఫ్-రిస్క్ అసెస్‌మెంట్ టూల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ ప్రవర్తన, హెచ్‌ఐవీకి గురయ్యే అవకాశం వంటి అంశాల ఆధారంగా గోప్యంగా ప్రమాద స్థాయిని అంచనా వేసుకోవచ్చు. అవసరమైతే సమీపంలోని ఆరోగ్య సేవలు, పరీక్షా కేంద్రాల వివరాలను కూడా ఈ టూల్ ద్వారా పొందవచ్చు.

కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం చేపట్టిన ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ (MAS) కార్యక్రమంలో భాగంగానే కాలేజీల్లో ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ ఆరోగ్య స్థితి తెలిసేలా చేయడం, హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారందరికీ చికిత్స అందించడం, 99 శాతం మందిలో వైరల్ లోడ్‌ను నియంత్రించే స్థాయికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. కాలేజీల్లో స్వచ్ఛంద పరీక్షలను విస్తరించడం ద్వారా యువతలో హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.