Site icon NTV Telugu

కేబినెట్ భారీ ప్రక్షాళన.. ఏకంగా 10 మంది మంత్రులు ఔట్..?

ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే కాదు.. తనకు నచ్చిన టీమ్‌, తాను మెచ్చిన విధంగా పనిచేసే టీమ్ ఉండాలని అందరు సీఎంలు కోరుకుంటారు.. ఇక, జాతీయ పార్టీలు అయితే.. వివిధ సమీకరణలు చూసుకుని మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన చేపడుతుంటింది.. ఇక, నాలుగు నెలల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై.. బీజేపీ హైకమాండ్‌ ఆదేశాలను మంత్రి వర్గ విస్తరణపై దృష్టిసారించారు.. తన కేబినెట్‌లో ప్రస్తుతం ఉన్న సుమారు 10 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండే విధంగా ఆయన కసరత్తు చేస్తున్నారని టాక్..

Read Also: 700 మంది రైతులు అమరులైనా డేటా లేదా..?

అయితే.. కర్ణాటకలో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.. వాటి ఫలితాలు ఈ నెల 14వ తేదీన వెలువడనున్నాయి.. ఆ తర్వాత కేబినెట్‌లో కీలక మార్పులు జరగనున్నాయని సమాచారం.. కర్ణాటక కేబినెట్‌లో 34 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా 30 మంది మంత్రులు ఉన్నారు. దీంతో.. ఖాళీలు భర్తీ చేయడంతో పాటు.. కొంతమందిని పంపించే విధంగా కూడా కసరత్తు ప్రారంభించారు సీఎం బొమ్మై.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం తర్వాత, బొమ్మై ఆగస్టు 4న 29 మంది మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గాన్ని విస్తరించారు.. చాలా మంది ఆశావహులతో, బొమ్మై మంత్రివర్గాన్ని విస్తరించాలని, నాలుగు ఖాళీలను భర్తీ చేయాలని ఒత్తిడిలో ఉన్నారు.. ఇక, మొదటి నుండి బీజేపీలో కొనసాగుతున్న పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆగస్టులో జరిగిన మంత్రివర్గ విస్తరణతో కలత చెందారు, ఎందుకంటే వారిని తప్పించడం.. బయటివారికి ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు.. దీంతో.. భారీ ప్రక్షాళన ఉంటుందని.. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఆరుగురు అభ్యర్థులను మాత్రమే నిలబెట్టగా, బీజేపీ, కాంగ్రెస్ 20 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి పెట్టాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో..? కేబినెట్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version