NTV Telugu Site icon

తెలకపల్లి రవి: రాజద్రోహం కేసులపై సిజెఐ వ్యాఖ్యలు నిజమవుతాయా?

వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్‌ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. గాంధీ తిలక్‌ వంటి జాతీయ నాయకులను శిక్షించేందుకు బ్రిటిష్‌ వారు తెచ్చిన ఈ సెక్షన్లు 75ఏళ్ల స్వాతంత్రం తర్వాతా దేనికని సిజె రమణ మాజీ మేజర్‌ జనరల్‌ వోంబట్కరే దాని రద్దుకోసం దాఖలు చేసిన కేసు సందర్భంగా ప్రశ్నించారు. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్‌ చట్టం,1928 ప్రజాభద్రతా చట్టం ఇవన్నీ పరాయి ప్రభుత్వం దేశ ప్రజలస్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తెచ్చినవే. 

ఐపిసి124(ఎ) ఆ అంశాలకే ప్రతిరూపం. హింసను ప్రేరేపించడం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్నీ పడగొట్టాలని ప్రయత్నించడం మాత్రమే రాజద్రోహమని 1962లో కేదార్‌నాథ్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం పాత్రికేయులందరికీ రక్షణ వుండాల్సిందేనని ప్రకటించింది, జర్నలిస్టుల వ్యాఖ్యలు కథనాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వున్నంత మాత్రాన కేసులు రాజద్రోహం కిందకు రాదని స్పష్టం చేసింది, ఆ తీర్పు వెలువడి యాభై ఏళ్లు గడిచినా రాజద్రోహం  కేసులు కొనసాగుతూనే వున్నాయి.

ఇటీవలి కాలంలో చాలాసార్లు ఈ తరహాలోనే సుప్రీం దర్మాసనాలు వ్యాఖ్యానాలు చేసినా నిర్ణయాత్మకంగా కొనసాగింపు లేదు. ఇదేగాకుండా ఇంకా వివిధ సందర్బాలలో ప్రభుత్వాలు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం,(పిడి) జాతీయ భద్రతా చట్టం(నాసా), టెర్రరిస్టు కార్యకలాపాల నిరోధ చట్టం(టాడా), ఉగ్రవాద కార్యకలాపాలనిరోధక చట్టం(ఉపా) వంటివి తీసుకొచ్చాయి. ఒకదానిపై పోరాడి ఓడిస్తే మరో నిరంకుశ చట్టం తేవడం జరుగుతూనే వుంది. 124(ఎ)వీటన్నిటికీ పరాకాష్టగా కొనసాగుతున్నది. గతంలో జరిగింది ఒక  ఎత్తు అయితే నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా కేసులు బాగా పెరిగిపోయాయి. 

2014లో 47, 2015లో 30, 2016లో 35, 2015లో 51, 2018 లో 70, 2019లో 93 రాజద్రోహం కేసులు నమోదవడం గమనిస్తే ఈ సంఖ్య పెరుగుతూనే వుందని అర్థమవుతుంది.. సంబంధిత వ్యక్తులు విచారణ లేకుండా ఖైదులో మగ్గిపోతూ వేధింపులకు గురవడం జరుగుతున్నది. అడ్డగోలుగా బనాయిస్తున్నారు గనక ఈ కేసుల్లో అంతిమంగా శిక్షలు పడే శాతం నామమాత్రం, 2016, 17లలో లో ఒక్కొక్కరికి, 2018లోఇద్దరికి 2019లోముగ్గురికి మాత్రమే నేర నిర్దారణ జరిగింది, అదైనా ఏ పద్దతిలో జరిగిందనేది పరిశీలించవలసిందే, అంటే విచారణలో నిలవని కేసులలో కూడా ఏళ్లతరబడి నిర్బంధించడం, వేధించడం జరుగుతూనే వుందన్నమాట,భీమ్‌ కోర్‌గావ్‌ కుట్ర కేసులో అరెస్టయిన వయోవృద్ధుడు స్టాన్‌స్వామి ప్రాణాలే కోల్పోయారు. వరవరరావు  వికలాంగుడైనప్రొఫెసర్‌ సాయిబాబ, పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఖైదులో మగ్గిపోతున్నారు. 

అస్పష్ట నిబంధనలతో నిర్బంధం

ఐపిసి124(ఎ) నిజానికి చాలా అస్పష్టంగా వుంటుంది. దాన్ని ఎలాగైనా బనాయించవచ్చు. ‘‘ఎవరైనా సరే తమ మాటల ద్వారా గాని మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా సంజ్ఞలు లేదా ప్రత్యక్ష వ్యక్తీకరణల ద్వారా గాని మరో విధంగా గాని విద్వేషంలేదా ధిక్కారం వ్యాప్తి చేసేట్టయితే భారతదేశంలో చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అయిష్టతను విముఖతను రెచ్చగొట్టేట్టయితే ప్రేరేపించేట్టయితే వారికి కారాగారశిక్షకు పాత్రులగుదురు’ ఈ కారాగారశిక్ష మూడేళ్ల నుంచి యావజ్జీవం వరకూ వుండొచ్చు. రెండూ కలిసి కూడా వుండొచ్చు. ఇందులో అయిష్టత వైముఖ్యం అన్నదాంట్లో విశ్వాసరాహిత్యం, శత్రుభావన కూడా కలిసి వున్నాయనీ, ప్రభుత్వ విధానాలను చట్టం ద్వారా మార్చడానికి ప్రయత్నిస్తే అది రాజద్రోహం కాదు. ద్వేషం ధిక్కారవ్యాఖ్యలు కూడా రాజద్రోహం కాదని  వివరణలు, చెబుతున్నాయి. ఆచరణలో మాత్రం విచక్షణా రహితంగా ప్రయోగిస్తూనే వున్నారు., కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ యుపిలోని హత్రాస్‌లోదళిత బాలిక అత్యాచారానికి గురైన దారుణ ఘటనకు సంబంధించి వివరాల సేకరణ కోసం వెళ్లి ఈ సెక్షన్‌ కింద అరెస్టయ్యారు.

కర్ణాటకలోని ఒక విద్యాలయంలో సిఎఎకు వ్యతిరేకంగా నాటకం వేసిన తలిదండ్రులపైన కూడా ఈ రాజద్రోహం కేసులే బనాయించారు. జెన్‌యు విద్యార్థులపైన కూడా ఇలాటి విద్రోహం కుట్ర ఆరోపణలే మోపారు. ఆ సమయంలో హోంమంత్రి అమిత్‌ షా దారుణంగా మాట్లాడారు. రైతుల ఆందోళనను బలపర్చినందుకు గాను బెంగుళూరులోదిశారవి అనే పర్యావరణ కార్యకర్తపైన ఇదే ఆందోళనకు సంబంధించి రిపబ్లిక్‌ దినోత్సవంనాడు జరిగిన ఘటనల వాస్తవాలు వెల్లడించినందుకు రాజ్‌ దీప్‌ సర్దేశాయి, వినోద్‌జోష్‌, జఫర్‌ ఆఘా, పరేశ్‌నాథ్‌, అనంతనాథ్‌ తదితరులపై రాజద్రోహం కేసులే పెట్టారు, సుప్రీంకోర్టు వారిని అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాల్సివచ్చింది. రాష్ట్రాలలో కూడా అనేక విధాల దీన్ని దుర్వినియోగపర్చడం జరుగుతున్నది. బెయిల్‌రాకుండా చేయాలంటే ఈ సెక్షన్‌ ప్రయోగించాలనేది ఒక  తారకమంత్రంగా మారింది.

సుప్రీం కోర్టు కూడా చెప్పిందే 

ఇప్పుడు సిజెఐ చేసిన వ్యాఖ్యలకు కొద్దిగా ముందే సుప్రీం కోర్టునుంచి ఇలాటి మాటలు వినిపించడం ప్రజాశక్తిలో చెప్పుకున్నాం (జూన్‌ 6,2021) వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌ దువా కేసులో జూన్‌ మూడవ తేదీన సుప్రీంకోర్టులో జస్టిస్‌ యుయు లలిత్‌, ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.  మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పు స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా కట్టడిలో వైఫల్యం వంటివాటిని సూటిగా విమర్శించినందుకే వినోద్‌దువాపై ఈ సెక్షన్‌ బనాయించారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన వినోద్‌ యు ట్యూబ్‌ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై శ్యాం అనే బిజెపి నాయకుడు సిమ్లాజిల్లాలో కేసు పెట్టారు. అసత్య సమాచారం, ప్రజలలో అశాంతిని వ్యాపింపచేయడం, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల ప్రచురణ తదితర ఫిర్యాదులను దానికి జతచేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ యుయు లలిత్‌ ధర్మాసనం 2020 మార్చినాటి పరిస్థితుల్లో వలస కార్మికుల దుస్థితి వాస్తవమనీ వాటిపట్ల వ్యాకులతతో ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ పరిష్కార చర్యలు తీసుకోవాలిన వినోద్‌ దువా కోరడం ఏ విధంగానూ తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతకు కొద్ది రోజుల ముందే రెండు తెలుగు ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్‌లోనూ సుప్రీం కోర్టు  124(ఎ)ను మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం వుందని తెల్పింది. దీంతోపాటే భారత శిక్షాసృతి(ఐపిసి) సెక్షన్‌153(ఎ) వివిధ తరగతుల ప్రజల మధ్య వైషమ్య వ్యాప్తి, 505 ప్రజాజీవితంలో కల్లోలసృష్టి అనే నిబంధనలను కూడా మీడియా కోణంలో మళ్లీ పరిశీలించాల్సి వుందని చెప్పింది. 

మొత్తంగా తొలగింపే పరిష్కారం

ఒకసారి 124(ఎ) సెక్షన్‌ కింద ఎప్‌ఐఆర్‌ నమోదైనాక కింద పోలీసులు ఏంచేస్తారనేది చెప్పడానికి లేదు. అందరూ సుప్రీం కోర్టుకు రాలేరు. వచ్చినా అందరి కేసులూ ఒకేలా విచారణకు నోచుకోకపోవచ్చు. ఎపి ఎంపి రఘురామరాజుకు బెయిలు ఇవ్వడం తప్పుగాకున్నా అదే ఉన్నత న్యాయస్థానాలు కరోనాసోకినా స్టాన్‌స్వామికి గాని సిద్దిక్‌ కప్పన్‌కు గాని ఉపశమనం కలిగించిందిలేదు. అర్నబ్‌గోస్వామికే ఉపశమనం దక్కింది, ఘోరమైన మతకలహాలు రగిలించిన మారణహోమాలకు కారణమైన కుట్రదారులు ఈ చట్టాల కింద ఎప్పుడు నిర్బందించబడలేదు గాని సామాజిక కార్యకర్తలూ జర్నలిస్టులూ రచయితలపై ప్రయోగించబడటం వాస్తవం. కనుక వీటినిమొత్తంగా ఎత్తివేయడమే పరిష్కారం తప్ప పైపై మాటలతో జాగ్రత్తలు చెప్పడంతో ప్రయోజనం వుండదు.

అయితే  ముందే పేర్కొన్నట్టు గత నెలలోనూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకటి ఇదే విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు 2016లో పార్లమెంటులో ప్రభుత్వమే స్వయంగా  రాజద్రోహం నిబంధనలు చాలా విస్తారంగా అస్పష్టంగా వున్నాయి గనక పున:పరిశీలించవలసిన అవసరం వుందని చెప్పింది, 2018లో లా కమిషన్‌ మరింత సూటిగా ఈ అంశాన్ని చర్చించింది. ఒక పుస్తకంలోంచి ఒక పాటను పాడటమే దేశభక్తి అని చెప్పడం సరికాదని స్ష్టష్టంచేసింది. అంటే అందుకు భిన్నమైన దాన్ని దేశద్రోహం అనలేమని చెప్పిందన్నమాట. ఇన్ని సంవత్సరాలలోనూ అనేక విధాలుగా ఈ సెక్షన్‌ను అరెస్టయినవారు మాత్రమే గాక హక్కుల సంఘాలు ఆలోచనా పరులు సవాలు చేయడం జరుగుతూనే వుంది గాని ఫలితం లేదు. ఇప్పుడు కూడా సిజెఐ అటార్నీ జనరల్‌ కెకెవేణుగోపాల్‌ను ఈ విషయంలో ప్రభుత్వ స్పందన ఏమిటని ప్రశ్నిస్తే ఆయన సూటిగా వద్దని చెప్పలేదు. జాగ్రత్తలు పాటించాలని చెబితే  అమలు చేస్తామన్నారు. దుర్వినియోగం నివారిస్తే సరిపోతుందిగాని మొత్తం తొలగించనవసరం లేదన్నారు.

రెండు పార్టీల మధ్యన విభేదాలువుంటే లేక గ్రామంలో ఎవరిపైనానా వ్యతిరేకత వుంటే ఈ చట్టాన్ని బనాయించవచ్చునని సిజె అన్న మాటలు వాస్తవమే గాని  ప్రస్తుత నేపథ్యాన్ని ఇప్పుడు విశృంఖల దుర్వినియోగాన్ని గుర్తించడం మరింత అవసరం. సెక్షన్‌124(ఎ) మౌలికంగానే అప్రజాస్వామికమైనది. దాన్ని దుర్వినియోగం అని విడిగా అనాల్సిన పని వుండదు. ఆధునిక ప్రజాస్వామిక భావనతో అది పొసగదు. రాజ్యాంగం 14అధికరణం చట్టంముందు పౌరులసమానత్వాన్ని, 19అధికరణ విమర్శనతో సహా భావ ప్రకటనా స్వేచ్చనూ కల్పిస్తున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదోచేశారని శిక్షించడం ఎలా చెల్లుతుంది? 21వ అధికరణం పౌరుల ప్రాణాలకు రక్షణ హక్కు నిస్తున్నది. వీటన్నిటినీ తోసిరాజనే నిరంకుశచట్టాలు రాజ్యాంగవిరుద్దమే. ఎన్ని జాగ్రత్తలు పొందుపర్చినా ప్రభుత్వాలు పోలీసులు దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ఏం చేసేది ఎవరు చెబుతారు? ఐటి చట్టం సెక్షన్‌66(ఎ) ఎప్పుడో కొట్టివేసినా ఇంకా కేసులు వేస్తునేవున్నారని సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహించింది. నిందితుణ్ని గట్టిగా ఇరికించాలనే ఒకటి కాకుంటే మరో కఠినమైన చట్టం బనాయించవచ్చుననే భావన పాలకులలో పోలీసులలో పాతుకుపోయింది..

సిజెఐ రమణ 124(ఎ) దుర్వినియోగం ఆపాలన్నారు గాని మొత్తం రద్దుచేయాలనలేదని, ఆ అవసరం లేదని మాజీ సిజె రంజన్‌ గోగోయ్‌ చెప్పడం యాదృచ్చికం కాదు. పదవీ విరమణ వెనువెంటనే రాజ్యసభకు నామినేట్‌ అయిన గోగోయ్‌  కేంద్రానికి తనవిధేయత చాటుకోవాలనుకుంటున్నారు. కనుక దీనిపై దానికోసం న్యాయపరంగానే గాక రాజకీయంగానూ పోరాడాల్సిందే. అప్పుడే స్వేచ్చకు రక్ష, ఇప్పుడు వివిధ సంస్థలు వ్యక్తులు ఈ విషయంపై మొత్తం ఎనిమిది పిటిషన్ల దాకావేశారు గనక సత్వరం దాన్ని పూర్తిగా తొలగించడమే పరిష్కారం.