NTV Telugu Site icon

జేసీ వర్సెస్‌ పెద్దారెడ్డి.. మున్సిపల్‌ ఆఫీసులోనే నిద్ర..!

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హీట్‌ పెంచుతోంది పొలిటికల్‌ ఫైట్‌… మరోసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిగా మారింది పరిస్థితి… ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య యుద్ధమే నడుస్తుండగా.. తాజాగా.. మరో వివాదం చోటు చేసుకుంది.. ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి వెళ్లారు మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి… ఇదే సమయంలో మున్సిపల్ అధికారులను, సిబ్బందిని తీసుకుని నగరంలో పర్యటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దీంతో.. అధికారులు, సిబ్బంది అంతా ఎమ్మెల్యేతో పాటు వెళ్లిపోయారు.

మరోవైపు మధ్యాహ్నం వరకు సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంపై మండిపడుతున్న జేసీ… తమ మున్సిపాలిటీ అధికారులు కనిపించడం లేదని ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సమీక్ష సమావేశానికి అధికారులు రాకపోవడంపై గుర్రుగా ఉన్న ఆయన.. ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయంలోనే అధికారుల రాక కోసం వేచి చూస్తున్నారు.. అధికారులు రాకపోవడంతో రాత్రి కూడా మున్సిపల్ ఆఫీసులనే పడుకోవడానికి సిద్ధం అవుతున్నారు.. అధికారులు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెబుతున్నారు జేసీ.. మొత్తంగా మరోసారి తాడిపత్రి రాజకీయం చర్చగా మారింది.