Site icon NTV Telugu

జేసీ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబు దానిపై దృష్టి పెట్టండి..!

సంచలన వ్యాఖ్యలకు, ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా మాట్లాడడంలో జేసీ బ్రదర్స్‌కు పెట్టింది పేరు.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా అదే కోవలోకి వస్తారు.. ఇవాళ జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సీమలో ప్రాజెక్టులకంటే ముందు కార్యకర్తలను కాపాడండి అని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తల సమావేశం పెట్టండి.. ఇవాళ జరిగే సమావేశానికి అందరికీ ఆహ్వానం లేదన్నారు.. ఒకరిద్దరు నేతల కనుసన్నుల్లో సమావేశం జరుగుతోందని ఆరోపించిన జేసీ.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై దృష్టి సారించాలని సూచించారు.

అనంతపురం జిల్లాలో రెండేళ్ల నుంచి ఒక టీడీపీ కార్యకర్తను కూడా జిల్లా నాయకులు పట్టించుకోలేదన్నారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఒక్క టీడీపీ నాయకుడు కార్యకర్తల సాధక బాధలు పట్టించుకున్నారా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా..? అని నిలదీశారు.. నీటి ప్రాజెక్టుల పైన కాదు సదస్సులు పెట్టాల్సింది.. కార్యకర్తలను పట్టించుకోవాలని హితవుపలికిన ఆయన.. అనంతపురం టీడీపీ నాయకులు ఒక్క కార్యకర్తకు కూడా అండగా లేరంటూ సంచలన ఆరోపణలు చేశారు.. కార్యకర్తల కోసం మీటింగ్‌లు పెట్టాలి గాని ఇలాంటి సదస్సులు శుద్ధ దండగేనంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన జేసీ.. ఈ ప్రాజెక్టులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పోరాడాయి.. ఏమన్నా ఫలితం ఉందా…? అని ప్రశ్నించారు..

Exit mobile version