Site icon NTV Telugu

కోవిడ్ బాధిత కుటుంబాలకు జగన్‌ గుడ్ న్యూస్‌

కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. జీవానాధారం అయిన వారు కన్నుమూయడంతో సంపాదన లేక అల్లాడిపోయాయి లక్షలాది కుటుంబాలు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూశాయి కుటుంబాలు. కరోనా వైరస్‌ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కింద వీటిని అందజేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దీనిపై స్పందించిన ఒడిశా ప్రభుత్వం.. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

కరోనా బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం.. ధృవీకరించిన కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా చర్యలు చేపట్టనుంది. దేశంలో కరోనా వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకూ మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కోవిడ్‌-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలిచ్చింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థసిఫార్సు చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనుంది. ప్రభుత్వం పరిహారం అందిస్తే కుటుంబాలకు ఆపన్న హస్తం అందించినట్టవుతుంది.

Exit mobile version