Site icon NTV Telugu

ఆపరేషన్‌ పరివర్తన్‌ ఫలితాలు ఇస్తోందా..!

ప్రస్తుతం విశాఖ, విజయనగరం అటవీ ప్రాంతాల్లోని ఏ పల్లెకు వెళ్లినా తగలబడుతున్న గంజాయి కుప్పలే కనిపిస్తాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ఫలితాలు ఇస్తోంది. వేలాది ఎకరాలలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. 214 కేసులు బుక్కయ్యాయి. 546 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా వాహనాలను సీజ్‌ చేశారు.

వైజాగ్‌ ఏజెన్సీ, ఏవోబీలో దాదాపు 15 వేల ఎకరాలలో గంజాయి సాగవుతోంది. ఎకరాకు 1000 నుంచి 1200 వందల కిలోల గంజాయి దిగుబడి వస్తుంది. అలా, ప్రతి సంవత్సరం పదివేల టన్నుల గంజాయి ఉత్పత్తి అవుతోంది. దీని విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు. కిలో గంజాయి ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది.

గంజాయి పండించటం చట్ట విరుద్ధమని తెలిసినా సాగుచేయకుండా ఉండలేకపోతున్నారు. కారణం పేదరికం. దాంతో కొన్నేళ్లుగా ఏజెన్సీ రైతులకు ఇది కుటీర పరిశ్రమగా మారింది. దీని ద్వారా వారికి కొంత ఆదాయం పక్కాగా లభిస్తుంది. ఇప్పుడు చాలా కుటుంబాలకు గంజాయి సాగే జీవనాధారం. అందుకే కావచ్చు ఏ ఇంటి ముందు చూసినా ఆర బెట్టిన గంజాయి గుత్తులు కనిపిస్తాయి.

ఈ ప్రాంతంలో పైనాపిల్ వంటి ఇతర పంటలు కూడా పండుతాయి. ఐతే, అవి గంజాయిలా లాభసాటి కాదు. ఇక, సేకరించిన అటవీ ఉత్పత్తులను అమ్మగా వచ్చేదీ అంతంత మాత్రమే. రెక్కాడితే గాని డొక్కాడదు. రాగి అంబలే ఆహారం. ఆరోగ్య సంరక్షణ కరువు. బిడ్డ పుడితే బతికి బట్టకడితే అది అదృష్టమే. ఇక మహిళలు, పిల్లలు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలవుతుంటారు. రక్త హీనత ఇక్కడ ప్రధాన సమస్య .

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులలో అత్యంత వెనకబడిన పర్టికులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీజీటీ)కు చెందిన చాలా కుటుంబాలలో పరిపస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. విద్య అందుబాటులో ఉండదు. తిండిగింజలు వారే పండించుకోవాలి. సేకరించిన అటవీ ఉత్పత్తులను వారానికోసారి జరిగే స్థానిక సంతలలో విక్రయిస్తారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర గిరిజిన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) లెక్కల ప్రకారం మొత్తం గిరిజన కుటుంబాలలో 28 శాతం కుటుంబాలు పీవీటీజీ కి చెందినవే.

కొన్నేళ్ల నుంచి చేస్తున్న గంజాయి సాగు వీరి జీవితాల్లో మార్పు తెచ్చిందని స్థానికులు అంటారు. ఎకరా భూమిలో గంజాయి సాగు చేస్తే రెండు లక్షల వరకు గిట్టుబాటువుతుంది. దానితో వారు రెండు మూడు సంవత్సరాల పాటు హాయిగా బతుకుతారు. మెరుగైన జీవనోపాధులు లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితిలో గంజాయి సాగు చేస్తున్నామంటారు వీరు.

మరోవైపు, గంజాయి పెంపకానికి ఇక్కడి సహజ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం, ఉదయం పూట పొగమంచు వల్ల గంజాయి మొక్కలను పెంచేందుకు అనువుగా ఉంటుంది. ఇక ఈ ప్రాంతాలలోకి ప్రవేశించటం అంత సులభం కాదు. ఇది కూడా వారికి అనుకూలించే అంశమే. మావోయిస్టుల ఉనికి కూడా ఈ విషయంలో వారికి సాయపడుతుంది.

విశాఖ జిల్లాలోని పదకొండు ఏజెన్సీ మండలాల్లో 2,160 గిరిజన గూడేలు ఉన్నాయి. వాటిలో 569 గూడేలకు కనీసం రోడ్డు లేదు. 886 కుగ్రామాలకు కచ్చా రోడ్డే దిక్కు. ఈ ఊళ్లకు వెళ్లాలంటే కొండలు గుట్టలు ఎక్కాల్సిందే. అందువల్ల ఈ ప్రాంతాలకు ఎప్పుడో గానీ పోలీసులు రారు. గ్రామాలకు ఇప్పటికీ కరెంటు లేదు. దాంతో సూర్యాస్తమయం తరువాత పల్లెలన్నీ చీకట్లోకి జారుకుంటాయి.

మళ్లీ గంజాయి విషయానికి వస్తే, గూడెంలోకి ఏదైనా వాహనం వచ్చిందంటే అది గంజాయి కస్టమర్లదే అయి ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్మగ్లర్లు ఇక్కడకు వస్తారు. ఇందుకు దళారుల సాయం తీసుకుంటారు. ఈ బ్రోకర్లకు ఇటు పోలీసులు, అటు రాజకీయ నేతలతో లింకులు ఉంటాయి. అలాగే గంజాయి సాగుదారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఎక్కడ, ఎంత గంజాయి దొరుకుతుందో వీరికి తెలుసు.

సాధారణంగా జూన్-జూలైలో పంట వేస్తారు. నవంబర్ ,జనవరి మధ్య పంట చేతికి వస్తుంది. కొందరు కస్టమర్లు ముందే వచ్చి గంజాయి విత్తనాలు, ఎరువులు, కొంత అడ్వాన్స్‌ కూడా ఇచ్చి వెళతారు. మళ్లీ తిరిగి పంట చేతికి వచ్చే సమయానికి ఇక్కడ ప్రత్యక్షమవుతారు. ఐతే, కొందరు మాత్రం పంట కాలంలో నేరుగా వచ్చి ఎలాంటి గంజాయి కావాలో చాలా చోట్ల తిరిగి ఎంపిక చేసుకుంటారు.

ఇక గంజాయి ధరలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘వీస’ అనే స్థానిక కొలమానంతో గంజాయిని కొలుస్తారు. కిలో నాలుగు వందల గ్రాములు ఒక వీస. వీస గంజాయి ధర 400 వందల రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. అలా, సగటు రైతు ఒక సీజన్‌లో ఎకరాకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు సంపాదిస్తాడు. ఐతే, తాము పండించిన గంజాయిని దళారులు నగరాలలో ఏ ధరకు అమ్ముతారనే విషయం వారి ఊహకు కూడా అందదు. వచ్చిందే గొప్ప అనుకునే అమాయక గిరిజనులు. ఇక్కడ ఐదు వందలకు కొనుగోలు చేసిన సరుకు మార్కెట్లో 30 వేల నుంచి 70 వేలకు అమ్ముడవుతుందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

కస్టమర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం గంజాయి పంటను అతడికి అప్పగించటంతో రైతు బాధ్యత తీరుతుంది. ఇక ఆ సరుకును ఏజెన్సీ బార్డర్‌ దాటించటం బ్రోకర్ పని. తిరిగి వెళ్లేటప్పుడు పోలీసు చెక్‌పోస్టులను ఎలా దాటాలో అతడే చూసుకుంటాడు. కస్టమర్‌ చేతికి గంజాయి అందిన తరువాత దానిని గమ్యస్తానాలకు చేర్చటం చాలా కష్టం. ముందు చెక్‌పోస్టుల వద్ద పట్టుబడకుండా ఏజెన్సీ దాటించాలి. స్మగ్లర్లు తరచూ గిరిజన ప్రాంత యువకులకు ఖరీదైన బైక్‌లు, ప్రోత్సాహకాలను పారితోషికంగా ఎరగా వేసి గంజాయి తీసుకెళ్ళే వాహనాలకు పైలట్లుగా వ్యవహరిస్తారు. ముందు యువకుడు బైక్‌ మీద వెళుతూ చెక్‌పోస్టుల మీద ఓ కన్నేసి ఉంచుతాడు. ఎక్కడైనా చెకింగ్స్‌ ఉంటే ముందే సదరు వాహనాన్ని అప్రమత్తం చేస్తాడు. చెక్‌పాయింట్‌ను గమనించిన వెంటనే గంజాయి రవాణా చేస్తున్న వాహనం డ్రైవర్‌కు కాల్ చేస్తాడు. ఫోన్‌ కనెక్ట్‌ కాని పక్షంలో యూ టర్న్‌ తీసుకుని వాహనానికి ఎదురువెళ్లి అప్రమత్తం చేస్తాడు.

ఈ మొత్తం రవాణా ప్రక్రియ పద్దతి ప్రకారం ఖచ్చితమైన ప్రణాళికతో సాగుతుంది. గంజాయి గమ్యం చేరటంలో అనేక దశలు ఉంటాయి. ప్రతి దశలో దాని రేటు మారిపోతుంది. రాజకీయ నేతలు, బ్రోకర్లు, పోలీసులు ఇలా చాలా మందికి పర్సెంటీజీలు ముట్టచెప్పాల్సి వుంటుంది. అందుకే గంజాయి ధర ఊహించని స్థాయికి పెరుగుతోంది. ఇక, స్మగ్లింగ్‌ చేసే వాహనాలు తరచూ తనిఖీలకు గురవుతాయి. వాహనాల లోపల లేదా వాహనం అడుగు భాగాన ఏర్పాటు చేసిన ప్రత్యేక పెట్టెలలో గంజాయిని నింపుతారు. తనిఖీలు జరిగినపుడు ఆ బాక్సులు పోలీసులకు కనిపించవు. మందస్తు సమాచారం ఉంటే తప్ప వాటిని పట్టుకోలేరు.

విశాఖపట్నం ఏజెన్సీలోని అనేక మండలాలలో గంజాయి నెట్‌వర్క్‌ వేళ్లూనుకుంది. పోలీసు దాడులలో పట్టుబడిన వారు ఏళ్లకు ఏళ్లు జైళ్లలో మగ్గుతున్నారు. తీవ్రమైన నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ చీకటి వ్యాపారం సూత్రదారులు ఎవరన్నది ఎవరికీ తెలియదు. ఎక్కడో ఉండి ఇక్కడ కథ నడుపుతారు. అమాయక గిరిజనునలకు డబ్బు, ప్రోత్సాహకాలు ఆశచూపి మళ్లీ మళ్లీ వారిని దోపిడీ చేస్తూనే ఉంటారు.

గంజాయి సాగు సమస్యను ఐటీడీఏ సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోణం నుంచి చూస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఏజెన్సీ రైతులకు సూచిస్తోంది. కానీ ప్రభుత్వం భారీగా నిధులు సమకూరిస్తే తప్ప ఈ ఆలోచనలు ముందుకు సాగవు. మూలాల నుంచి తొలగిస్తే తప్ప గంజాయికి శాశ్వత నిర్మూలన లేదు. ఆపరేషన్ పరివర్తన్‌ ఏజెన్సీలో గంజాయి దందాకు ప్రస్తుతం చెక్‌ పెట్టింది. కానీ ఈ ప్రాంత గిరిజన రైతులను అదుకునేందుకు ఓ శాశ్వత పరిష్కారంతో ప్రభుత్వం ముందుకు రానంత వరకు గంజాయి సాగును నిర్మూలించటం కష్టమే. అప్పటి వరకు ఆపరేషన్‌ పరివర్తన్‌ ఓ ప్రయత్నంగానే మిగిలిపోతుంది!!
-Dr. Ramesh Babu Bhonagiri

Exit mobile version