NTV Telugu Site icon

జడ్జి హత్య కేసు… సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

CJI NV Ramana

CJI NV Ramana

జార్ఖండ్‌ జడ్జి హత్య కేసులో సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. అయితే, అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరచడం బాధాకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఇక, జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ హత్య కేసును నిన్న స్వాధీనం చేసుకుంది సీబీఐ.. జూలై 28న మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన న్యాయమూర్తి ఆనంద్‌ను ఆటోతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు. దీంతో.. సీబీఐ రంగంలోకి దిగింది.

మరోవైపు కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్ సుమోటోగా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసును విచారణకు స్వీకరించింది.. ఈ సందర్భంగా జార్ఖండ్‌ ప్రభుత్వ తరపున న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు.. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో సీబీఐకి ఈ కేసును ట్రాన్స్‌ఫర్‌ చేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు… ఈ కేసు సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జడ్జిలకు వస్తున్న బెదిరింపులపై ఐబీకి గానీ, సీబీఐకి గానీ ఫిర్యాదు చేసినా.. అటువైపు నుంచి సానుకూలమైన స్పందన రావడంలేదన్నారు. ఇక, ఈ కేసులో వచ్చేవారం నుంచి పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్టు తెలిపారు.