Site icon NTV Telugu

భారతీయ రైల్వే ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ

భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు.

కాగా గతంలోనూ రైల్వేల ప్రైవేటీకరణ విషయంపై అప్పటి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టత ఇచ్చారు. తాము ఎప్పటికీ రైల్వేలను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పినా.. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు రైతుల ఆందోళన, ఇతర సంస్థ ఆందోళనల కారణంగా ఈ ఏడాది రైల్వేలకు రూ.36.87 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నార్తన్ రైల్వేకు అత్యధికంగా రూ.22.58 కోట్ల నష్టం వచ్చిందన్నారు. రైల్వేల భద్రత పూర్తిగా రైల్వే పోలీసులు లేదా జిల్లా పోలీసుల చేతుల్లో ఉందని.. ప్రయాణికుల రక్షణ విషయంలో రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version