Site icon NTV Telugu

బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు.

Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్‌టెన్షన్‌తో పాటు డయాబెటిస్ కూడా ఉందని అధికారులు నిర్ధారించారు. డిసెంబరు 15న 73 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని… ఈ క్రమంలోనే జ్వరం, దగ్గు, రినైటిస్‌ వంటి లక్షణాలతో బాధపడుతుండడం కారణంగా ఒమిక్రాన్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. అనంతరం డిసెంబర్ 21, 25 తేదీల్లో మరోసారి ఒమిక్రాన్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని… అయితే ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ న్యూమోనియా ఎఫెక్ట్ ద్వారా వృద్ధుడు మరణించాడని అధికారులు పేర్కొన్నారు. కాగా ఉదయ్‌పూర్‌లో ఇప్పటి వరకు 3 ఒమిక్రాన్​ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్​రాష్ట్రంలో మొత్తం 69 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.

మరోవైపు మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. పుణెలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.

Exit mobile version