NTV Telugu Site icon

రివ్యూ : ఇదే మా కథ

Idhe Maa Katha Movie Review

Idhe Maa Katha Movie Review

తెలుగులో రోడ్ జర్నీ మూవీస్ చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికే కావచ్చు నూతన దర్శకుడు గురు పవన్ ‘ఇదే మా కథ’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను జి. మహేశ్ నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా ‘ఇదే మా కథ’ అక్టోబర్ 2న జనం ముందుకు వచ్చింది.

ఇదో నలుగురు వ్యక్తుల జీవిత కథ. యుక్త వయసులో లడక్ లో తనకు తారస పడిన తులసిని చేరుకోవాలని మహేంద్ర (శ్రీకాంత్) కలలు కంటాడు. పాతికేళ్ల కాల గమనంలో అతను కోటీశ్వరుడిగా ఎదిగినా… బైక్ మీదే లడక్ వెళ్లాలని భావిస్తాడు. మల్టీ మిలియనీర్ కొడుకు, యూ ట్యూబర్ అయిన అజయ్ (సుమంత్ అశ్విన్)కు అడ్వంచరస్ లైఫ్ అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా బైక్ రేసింగ్ అంటే ప్రాణం. తండ్రి తన ఆలోచనలకు విలువ ఇవ్వడం లేదనే కసితో చెప్పాపెట్టకుండా లడక్ కు రోడ్ జర్నీ ప్రారంభిస్తాడు. రాయల్ ఎన్ ఫీల్డ్ మెకానిక్ గా పనిచేస్తూ, ఆ బండి ఇంజన్ ను అప్ డేట్ చేసే క్రమంలో లక్ష్మీ (భూమిక) తండ్రి కన్ను మూస్తాడు. ఎలాగైనా తన తండ్రి ఆవిష్కరణను లడాక్ వరకూ రోడ్ జర్నీ చేసి, ఆ సంస్థ ప్రతినిధికి అందించాలన్నది లక్ష్మీ కోరిక. ఇక ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేశాడని తెలుసుకుని, అతనికి బుద్ధి చెప్పి, ఆ కసితో హైదరాబాద్ నుండి తన స్వస్థలమైన ఛండీఘర్ కు రోడ్ జర్నీ మొదలు పెడుతుంది మేఘన (తన్యా హోప్). వివిధ ప్రాంతాల నుండి హిమాలయ సానువుల్లోకి బయలు దేరిన ఈ నలుగురి జీవితాలు ఒకచోట ఎలా కలుసుకున్నాయి? వారి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది? చివరికి వారి జీవితాలు ఎలా ముగిసాయి? అనేదే ఈ చిత్ర కథ.

పేరుకు ఇది రోడ్ జర్నీ మూవీనే అయినా… దర్శకుడు దానిని మించి ఓ మానవీయ కోణాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. ప్రేమించిన వ్యక్తి కోసం జీవితాన్ని ఇవ్వడం, తల్లిదండ్రులను గౌరవించండం, పెద్దలు భౌతికంగా కనుమరుగైనా వారి లక్ష్యాలను వారసులు నేరవేర్చడం, ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న విలువల పతనాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోవడం… వీటిని నాలుగు ప్రధాన పాత్రల ద్వారా చెప్పించాడు.

లడాక్ వరకూ సాగే ప్రయాణం, మార్గం మధ్యలో పాత్రల స్వరూప స్వభావాలను తెలియచేయడం, వారి నేపథ్యాన్ని కొద్ది కొద్దిగా రివీల్ చేయడం బాగుంది. అలానే ఈ రోడ్ జర్నీ మూవీని ఓ డాక్యుమెంటరీ లానో, ఫిలసాఫికల్ ఫిల్మ్ గానో చూపించకుండా అక్కడక్కడ వినోదాన్ని జత చేశారు. అలానే కొద్ది పాటి యాక్షన్ సీన్స్ నూ మిక్స్ చేశారు. కొత్త కొత్త ప్రదేశాలను చూపించడం బాగుంది. శ్రీకాంత్ కు సంబంధించిన ఫ్లాఫ్ బ్యాక్ హృదయానికి హత్తుకుంటే, భూమిక కుటుంబం ఆమెకు బాసట నిలబడం అనేది ఓ కొత్త హోప్ ను కలిగించింది. అదే సమయంలో అజయ్ లోని తపనను తల్లిదండ్రులు గుర్తించడం, మరో పక్క మేఘన తన జీవితంలో నిజమైన ప్రేమను పొందడం వంటివి ప్రేక్షకులను అలరించే అంశాలే. వీటిని దర్శకుడు కన్వెన్సింగ్ గా తెరమీద చూపించాడు. అయితే… సాఫీగా సాగే ఈ కథలో యాక్షన్ మిక్స్ చేసే క్రమంలో దర్శకుడు ఆస్కారం లేని విలన్ ను సాంస్కృతిక పరిరక్షకుడి రూపంలో హఠాత్తుగా తెర మీదకు తీసుకొచ్చాడు. ఆ పాత్రను అక్కడితో వదిలేస్తే బాగానే ఉండేది. కానీ అదే వ్యక్తి తిరిగి లడాక్ బైక్ రేస్ లో పాల్గొన్నట్టు చూపడంతో ఆ పాత్రను అవసరానికి వాడుకున్నట్టు అనిపిస్తోంది.

నటీనటుల విషయానికి వస్తే… శ్రీకాంత్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. చాలా కాలం తర్వాత పూర్తి నిడివి ఉన్న అర్థవంతమైన పాత్ర చేశాడు. దానికి తగ్గట్టు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చాడు. భూమికను ఈ తరహా పాత్రలో ఎవరూ ఊహించరు. ఆమె పాత్ర ఈనాటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇక సుమంత్ అశ్విన్ ఈ తరం కుర్రకారును రిప్రజెంట్ చేసే పాత్ర పోషించాడు. అయితే… అతని హెయిర్ స్టైల్ ను భరించడం కాస్తంత కష్టమే. అతనిలోని నిర్లక్ష్య ధోరణిని చూపించడానికి ఆ క్రాఫ్ ను అలా పెట్టాల్సిన పనిలేదు. తన్యా హోప్ పాత్ర కాస్తంత ఎక్సెంట్రిక్ గా ఉంది. బహుశా యూత్ ను అట్రాక్ట్ చేయడం కోసం ఆ పాత్రను దర్శకుడు అలా మలిచి ఉండొచ్చు. బట్ ఆమె ఇంట్రడక్షన్ సీన్స్ ను ఇంకాస్తంత బెటర్ గా తీసి ఉండాల్సింది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సమీర్, శ్రీకాంత్ అయ్యంగార్, మధుమణి, పృథ్వీరాజ్, జోష్ రవి, సంధ్యా జనక్, భద్రం తదితరులు పోషించారు. అంతా బాగానే చేశారు. సప్తగిరి, త్రివిక్రమ్ సాయిపై చిత్రీకరించిన కామెడీ ట్రాక్ కాస్తంత నవ్వించింది.

సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. బట్… హృదయానికి హత్తుకునే స్వరాలను సునీల్ కశ్యప్ ఇవ్వలేకపోయాడు. పాటలు ఓ రకంగా మూవీకి మైనెస్ అనే చెప్పాలి. మాటలు అర్థవంతంగా ఉన్నాయి. తొలి చిత్రంలోనే చక్కని కథను రాసుకుని, అర్థవంతంగా దానిని తెరకెక్కించిన గురు పవన్ ను అభినందించాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు గతంలో తెలుగులో వచ్చిన రోడ్ జర్నీ మూవీస్ ‘గమ్యం, ఎవడే సుబ్రహ్మణ్యం, పాఠశాల’ వంటివి జ్ఞప్తికి రాకమానవు.

ప్లస్ పాయింట్

మైనెస్ పాయింట్స్

ట్యాగ్ లైన్: అర్థవంతమైన జర్నీ!

రేటింగ్: 2.5 / 5

Show comments