Site icon NTV Telugu

భారత్‌ బంద్‌కు భారీ స్పందన


దేశంలోని 19 ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపు సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పలు బీజేపీయేతర ప్రతిపక్షాలు బంద్‌ను విజయవంతం చేసేందుకు నడుంబిగించాయి. సంయుక్త కిసాన్‌ మోర్చ -SKP ఈ బంద్‌కు నాయకత్వం వహిస్తోంది. కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం బంద్‌ పిలుపినిచ్చారు.

దేశంలోని నలబై రైతు సంఘాలు ఏకమై సంయుక్త కిసాన్‌ మోర్చాగా ఏర్పడి మోడీ సర్కార్‌పై ఉద్యమిస్తున్నాయి. కొత్త చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని రైతు నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో ఏడాది నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఉద్యమంలో పాల్గొంటున్నారు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా, వామపక్షాలు ఇంకా అనేక రాజకీయ పక్షాలు రైతు ఆందోళనకు మద్దతు పలికాయి. పలు పార్టీలు ఈ బంధ్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. వివిధ పార్టీలకు చెందిన రైతు సంఘాలు ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొన్నాయి. బందు సందర్భంగా బీహార్‌లోని జాతీయ రహదారులన్నీ బ్లాక్‌ అయ్యాయి. రాజధాని పాట్నా సహా పలు జిల్లాలలో కాంగ్రెస్‌, ఆర్‌జేడీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు టైర్లు తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఒడిషాలో సామాన్య జనజీవనంపై భారత్‌ బంద్‌ తీవ్ర ప్రభావం చూపింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులు నిలిచిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. కాంగ్రెస్‌, శ్రేణులు ప్రధాన కూడళ్లలో ధర్నాలు చేశారు. వర్షం పడుతున్నా నిరసన కార్యక్రమాలు ఆగలేదు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజధాని భువనేశ్వర్‌ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బందు కొనసాగింది.

మరోవైపు, బెంగాల్‌లో బంధ్‌ ప్రభావం అంతగా కనిపించలేదు. వామపక్ష కార్యకర్తలు రోడ్లను నిర్భంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ఇది సాధారణ జన జీవనం పై పెద్దగా ప్రభావం చూపలేదు.ప్రజారవాణా, ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యాసంస్థలు యదావిధిగా నడిచాయి.

భారత్‌ బంద్‌ సందర్భంగా కేరళలో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. రాజధాని తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి.

మొదటి నుంచి రైతుల ఆందోళన తీవ్రంగా ఉన్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లో బంద్‌ సంపూర్ణమైంది.. ఢిల్లీ- అమృత్‌సర్‌ జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలిపారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను మూసివేశారు. ఉత్తరప్రదేశ్‌ ఘజిపూర్ సరిహద్దులో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.

భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్ ఎదుట వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ఆందోళన చేపట్టాయి.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్‌కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు.

గుర్గాం-ఢిల్లీ బార్డర్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను పోలీసులు చెక్‌ చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

Exit mobile version