NTV Telugu Site icon

టీటీడీ బోర్డు సభ్యత్వం: బాప్ రే ఇంత పోటీనా?

ప్రపంచంలో ఉన్న వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన భక్తజనం ఉన్నారు. వీరిందరికీ కూడా టీటీడీనే అన్నిరకాల వసతి, సదుపాయాలను కల్పిస్తోంది. ఈ పాలక మండలిలో సభ్యత్వం లభించిన వారికి నేరుగా శ్రీవారిని సేవించుకునే అవకాశం దక్కుతుంది. దీంతో టీటీడీ బోర్డులో స్థానం దక్కించుకునేందుకు రాజకీయ నేతల దగ్గరి నుంచి వ్యాపారులు, సంపన్నులు, సేవాపరులు పోటీపడుతూ ఉంటారు. ఇందులో చోటు దక్కడమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తుందంటారు. దీంతో ఈ పోస్టుకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ప్రతీ రెండేళ్లకోసారి టీటీడీ పాలకమండలి ఛైర్మన్ తోపాటు సభ్యులు మారుతూ ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా మరోసారి వైవీకే ఆ అదృష్టం దక్కింది. దీంతో కొత్తగా పాలక మండలి సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాలక మండలి సభ్యుల సంఖ్యను ప్రభుత్వం గతంలో 40కి పెంచింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగనుందనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహులు సైతం టీటీడీలో నామినేటేడ్ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ పదవిని శ్రీవారికి సేవ చేసే కోణంలో ప్రభుత్వం చూస్తుండటంతో ఎక్కడా రాజకీయాలకు తావులేకుండా పదవుల పంపకం చేయాలని భావిస్తోంది. వివాదరహితంగా ఉండే వారిని గుర్తించి నియామకం చేపట్టాల్సి ఉండటంతో ప్రభుత్వం సైతం ఆమేరకు కసరత్తులు చేస్తుంది. ఇందుకోసం 60నుంచి 70మందితో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర మంత్రులు ఇచ్చిన సిఫార్సులు లేఖలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని జగన్ సర్కారు తుది జాబితాను రెడీ చేసేందుకు సిద్ధమవుతోంది.

గతంలో మాదిరిగానే టీటీడీ బోర్డులో సభ్యులను ఏపీ, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని ప్రభుత్వం నియమించనుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఏపీకి పంపించిన సిఫార్సులు లేఖలను జగన్ సర్కారు పరిశీలిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిన సిఫార్సులను యథావిధిగా అమలు చేస్తే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈసారి టీటీడీలో సభ్యుల సంఖ్యను పెంచే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి.

కేంద్ర మంత్రులు తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ వారిని నియమించాలని సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి నియామకాన్ని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉపయోగించుకునేలా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన జీఎస్టీ బకాయిలు.. పోలవరం నిధులు.. కొన్ని ప్రాజెక్టుల అనుమతులు.. ఆర్ధిక చేయూత వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని కొందరు కేంద్రమంత్రులు ఎంపిక చేసిన వారికి టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

దీనిలో భాగంగానే కొందరికీ సభ్యత్వం ఇవ్వగా.. మరికొందరినీ ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనా టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో జగన్ సర్కారు వీరి విషయంలో ఎలా ముందుకెళుతుందనే మాత్రం ఆసక్తిని రేపుతోంది.