ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది.
టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించుకోనున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తమ సభ్యులను క్యాంపులకు తరలించాయి వైసీపీ, టీడీపీ. ప్రత్యర్ధి శిబిరాల్లోని సభ్యులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి వైసీపీ, టీడీపీ పార్టీలు. ఈ నేపథ్యంలో హైకోర్టుకెళ్లి ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు ఎంపీ కేశినేని నాని. ఎక్స్ అఫీషియో ఓటేసేందుకు అనుమతిస్తూనే ఎన్నిక ప్రక్రియ పూర్తైన తర్వాత ఫలితం ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
బెజవాడ కార్పోరేషన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓటేసేందుకు గతంలో అప్లై చేసుకున్నారన్న విషయమై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణకు అంగీకరించలేదు డివిజన్ బెంచ్. ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ జరిగే ఎన్నిక విషయంలో రెండు పార్టీలు పకడ్బందీ వ్యూహం అమలుచేస్తున్నాయి.