NTV Telugu Site icon

ఇవాళ‌, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

rains

ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు. మ‌రికొన్ని చోట్ల మోస్త‌రు వ‌ర్షం, చిరుజ‌ల్లులు ప‌డుతుండ‌గా.. మ‌రో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు త‌ప్పేలా లేవ‌ని హెచ్చరిస్తోంది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచ‌నా వేస్తోంది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్టు వెల్లడించింది. మ‌రోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని పేర్కొంది.

వీటి ప్ర‌భావంతో.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం, గురువారం పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది వాతావ‌ర‌ణ కేంద్రం.. ఈ మేరకు తెలంగాణ‌లోని పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేయ‌గా.. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది. గురువారం పలు జిల్లాల్లో అతిభారీ, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని హెచ్చరించింది. మ‌రోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు.