NTV Telugu Site icon

వరదలతో చిత్తూరు జిల్లా ఉక్కిరిబిక్కిరి

భారీవర్షాలు, వరదలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. జిల్లాకు ఇవాళ,రేపు భారీవర్ష సూచన ఉందన్నారు కలెక్టర్ హరినారాయణ. ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఇప్పటికే చెరువులు,డ్యాంలు పూర్తిగా నిండాయన్నారు. నదులు, వాగులు,నీటి ప్రవాహాలను దాటవదని, రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దంగా వుంచామని కలెక్టర్ హరి నారాయణ తెలిపారు.మరోవైపు తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది నీటి ప్రవాహం. దీంతో వాహనాల అనుమతిని నిలిపివేశారు అధికారులు.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని కపిలతీర్దం వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కపిలతీర్దం ప్రవాహంతో ముంపునకు గురవుతున్నాయి పలు కాలనీలు. సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల వారిని ఖాళీ చేయిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. మరోవైపు చంద్రగిరిలో కొనసాగుతున్న భారీ వర్షం పడుతోంది. శ్రీవారిమెట్టు నడక మార్గంలో వరద ఉధృతి పెరగడంతో భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారు.

కళ్యాణి డ్యామ్ కు భారీగా చేరుతుంది వరద నీరు. ప్రస్తుతం ఒక్క గేటు ద్వారా1700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు గేట్లు తెరిచేందుకు సిద్దమవుతున్నారు ఇరిగేషన్ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నామని అధికారులు చెప్పారు.